ఏపీలో ప్రయోగాత్మక కుల గణన ప్రక్రియ.. మంత్రి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కులగణన సర్వే పైలట్ ప్రాజెక్టును ఇవాళ ప్రారంభమైంది. కుల గణన ప్రక్రియ రెండు రోజులు జరగనుంది.
By అంజి Published on 15 Nov 2023 6:12 AM GMTఏపీలో ప్రయోగాత్మక కుల గణన ప్రక్రియ.. మంత్రి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కులగణన సర్వే పైలట్ ప్రాజెక్టును ఇవాళ ప్రారంభమైంది. నేటి నుంచి ఏపీలో మొదలైన ప్రయోగాత్మక కుల గణన ప్రక్రియ రెండు రోజులు జరగనుంది. ఈ క్రమంలోనే డా.బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రామచంద్రాపురం నియోజకవర్గం నేలపర్తిపాడు గ్రామ సచివాలయ పరిధిలో జరుగుతున్న కులగణన ప్రక్రియను మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పరిశీలించారు. కులగణన ప్రక్రియ రాష్ట్రంలో మొదలు కావడంపై హర్షం వ్యక్తం చేస్తూ.. జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి మంత్రి చెల్లుబోయిన పాలభిషేకం చేశారు. గ్రామ స్వరాజ్యమనే మహాత్ముడి లక్ష్యాన్ని సీఎం జగన్ సాధించారని మంత్రి అన్నారు.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత జనగణన తప్ప కులగణన జరగలేదన్న మంత్రి చెల్లుబోయిన.. నేడు మన రాష్ట్రంలో బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలను కులగణనతో సాధించబోతున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. ఉన్నత వర్గాలలోని పేదలతోపాటు, వెనుకబడిన వర్గాల, బడుగు బలహీన వర్గాల జీవితాలలో ఈ కులగణన వెలుగులు నింపనుందన్నారు. బిసీ సంక్షేమశాఖ మంత్రిగా తానుప్పుడు.. ఈ కులగణన జరగడం.. తన అదృష్టమని అన్నారు. తనకు ఎంతో ఇష్టమైనది బీసీలకు సేవ చేసుకోవడం, సీఎం జగన్మోహన్ రెడ్డి తనకు ఈ కీలక బాధ్యతలు అప్పగించడాన్ని అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. సమగ్ర కులగణన రాష్ట్రంలోని ప్రతి పేదవాడి జీవితానికి భద్రతా అని మంత్రి అన్నారు.
నేడు పైలట్ ప్రాజెక్టుగా జరుగుతున్న రెండు రోజుల కుల గణన పక్రియను తన నియోజకవర్గం నేలపర్తిపాడు గ్రామంలో పరిశీలించానని చెప్పారు. ఈ రెండు రోజుల పైలెట్ ప్రాజెక్టులో ఎలాంటి అంశాలు ఎదురవతున్నాయి.. వాటిని ఎలా పరిష్కారించాలనే వాటిపై అధ్యయనం చేస్తామని అన్నారు. అధికారులకు కూడా ఏ చిన్న అంశం కూడా వదలకుండా కులగణన ప్రక్రియ జరపాలని సూచించడం జరిగిందన్నారు. పేదవాడి సొమ్మును ఎలా దోచుకోవాలో గత ప్రభుత్వం చూస్తే.. పేదవాడి సొమ్మును ఎలా పేదవారికి చేర్చాలో జగన్మోహన్ రెడ్డి చూస్తున్నారని మంత్రి చెల్లుబోయిన పేర్కొన్నారు. అందుకు నిదర్శనమే ఈ కులగణన ప్రక్రియ అని చెప్పారు. కులగణన ద్వారా తమ వర్గాల యొక్క మనోభావాలను రక్షించిన నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి నిలిచారని అన్నారు.
ఇదిలా ఉంటే.. కుల గణన కోసం 5 జిల్లాల్లోని 5 సచివాలయాలను ఎంపిక చేశారు. వైఎస్సార్ జిల్లా పులివెందుల, శ్రీకాకుళం జిల్లా గార మండలం, కోమసీమ జిల్లా రామచంద్రాపురం పరిధిలో, ఎన్టీఆర్ జిల్లాలోని సచివాలయం పరిధిలో ప్రయోగాత్మకంగా ఈ సర్వే చేయనున్నారు. ఆయా సచివాలయాల పరిధిలోని ఇళ్ల దగ్గరకు వెళ్లి వలంటీర్లు, సచివాలయ సిబ్బంది కుల గణన సర్వే చేపట్టనున్నారు. ఈ సర్వేలో భాగంగా ప్రజల కులం, ఉపకులంతో పాటు పలు వివరాలను ప్రభుత్వం సేకరించనుంది.
సర్వేలో భాగంగా దాదాపు 20 అంశాలకు సంబంధించిన ప్రశ్నలను రూపొందించినట్లు తెలుస్తోంది. సర్వేలో పూర్తయిన తర్వాత ప్రతి కుటుంబానికి ఒక ఐడీ నెంబర్ కేటాయించనున్నారు. జనన, మరణ వివరాలను సైతం సేకరిస్తారు. సర్టిఫికెట్స్‌లో ఉన్న చిరునామాలోనే నివసిస్తున్నారా.. లేదా ఇతర ప్రాంతాల్లో ఉంటున్నారా..? ఎడ్యూకేషన్ క్వాలిఫికేషన్స్, ఉద్యోగం, ఇంటి రకం, వంట గ్యాస్ సౌకర్యం, వ్యవసాయ భూమి విస్తీర్ణం, నివాస స్థలం లాంటి వివరాలు సేకరిస్తారు.