ఆ 29 గ్రామాలు మినహా..ఏపీ వ్యాప్తంగా వచ్చే నెల నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంపు
By Knakam Karthik
ఆ 29 గ్రామాలు మినహా..ఏపీ వ్యాప్తంగా వచ్చే నెల నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంపు
ఆంధ్రప్రదేశ్‌లో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ విలువల సవరణ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మార్కెట్ విలువకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ విలువలు సవరించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి సవరించిన విలువలు అమల్లోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్‌కు ఆ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్పీ సిసోడియా ఆదేశించారు.
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని చోట్ల రిజిస్ట్రేషన్ విలువల పెంపు, తగ్గింపు చేసే అవకాశం ఉంది. రాజధాని అమరావతిలోని 29 గ్రామాల పరిధిలో మినహా రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో ధరల పెంపు అమల్లోకి రానుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు 10 శాతం మేర పెరిగే అవకాశం ఉంది.