వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డికి సంబంధం ఉందని తెలిసే అరెస్టు చేశారని వైస్సార్ కడపజిల్లా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి అన్నారు. హత్య కేసులో ముద్దాయిని అరెస్టు చేస్తే ధర్నాలు ఎందుకు చేస్తున్నారు.? హత్య కేసులలో ముద్దాయిలను అరెస్ట్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, ధర్నాలు చేస్తారా అని ప్రశ్నించారు. సీబీఐ అధికారులు నిజానిర్దారణ చేసుకున్న అనంతరం అరెస్టు చేస్తున్నారని పేర్కొన్నారు. హత్య చేస్తే ముద్దాయిలను వదిలి పెట్టాలా.? మీరు న్యాయం చేయరనే సునీత కోర్టును ఆశ్రయయించిందని అన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేయడం సమంజసమేనా అని ప్రశ్నించారు. ఈ కేసు కోసమే జిల్లా ఎస్పీని బదిలీ చేయకుండా ఉంచారని.. ఎస్పీ వైసీపీకి తొత్తుగా పని చేస్తున్నాడని ఆరోపించారు. సీబీఐ అధికారులు భాస్కర్ రెడ్డిని అరెస్టు చేసిన తరువాత అవినాష్ రెడ్డిని ఎందుకు అరెస్టు చేయరు.. ఈ కేసులో భాస్కర్ రెడ్డి కంటే అవినాష్ రెడ్డిపైనే తీవ్ర ఆరోపణలు ఉన్నాయన్నారు. సీబీఐ అధికారులు ఈ కేసులో నిజాయితీగా విచారణ జరిపినందుకు నా నమస్కారాలు అంటూ ముగించారు.