విశాఖ: తెలుగుదేశం పార్టీని వీడబోతున్నట్లు, వైసీపీ తీర్థం పుచ్చుకుంటారంటూ వస్తున్న పుకార్లపై టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పందించారు. ఈరోజు విశాఖపట్నంలో కాపునాడు పోస్టర్‌ను విడుదల చేస్తూ ఆయన మాట్లాడారు. సభను ఉద్దేశించి ప్రసంగించిన గంటా శ్రీనివాసరావు.. పార్టీ మార్పుపై క్లారిటీ ఇస్తూ, పార్టీ మార్పు గురించి తాను ఎప్పుడూ మాట్లాడలేదన్నారు. దీనిపై తాను ఏదైనా నిర్ణయం తీసుకుంటే అప్పుడు ప్రకటిస్తానని చెప్పారు. తన ప్రమేయం లేకుండానే పార్టీ మారుతాననే ప్రచారం జరుగుతోందని.. తన ప్రమేయం లేకుండానే డేటు, టైం కూడా ఫిక్స్ చేస్తారని మండిపడ్డారు. ఏం రాసుకున్నా.. ఏం ప్రచారం చేసుకున్నా తనకు సంబంధం లేదన్నారు.
రాష్ట్రంలో రెండు పార్టీలు మాత్రమే ఉన్నాయని గంటా శ్రీనివాసరావు అన్నారు. వంగవీటి రంగా ఒక నిర్దిష్ట పార్టీకి లేదా ప్రాంతానికి చెందినవాడు కాదని, బడుగు బలహీన వర్గాల నాయకుడని అన్నారు. కాబట్టే వారి గుండెల్లో రంగా చిరస్థాయిగా నిలిచిపోయారని చెప్పారు. డిసెంబర్ 26న కాపునాడు బహిరంగ సభ జరగనున్న సంగతి తెలిసిందే. కాపునాడు సభను విజయవంతం చేయాలని కోరారు. కాపునాడు పోస్టర్ పై వంగవీటి రంగా, మెగాస్టార్ చిరంజీవి, జనసేనాని పవన్ కల్యాణ్ ఫొటోలను ప్రముఖంగా ముద్రించారు.
విశాఖ జిల్లాలో సీనియర్ రాజకీయ నాయకుడైన గంటా శ్రీనివాసరావు 2019 ఎన్నికల్లో విశాఖ ఈస్ట్ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేసి గెలిచారు. అప్పటి నుంచి టీడీపీకి, రాజకీయాలకు కాస్త దూరంగా ఉంటున్నారు.