భూమా అఖిలప్రియను ఆసుపత్రికి తరలించిన పోలీసులు
మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను హుటా హుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
By అంజి Published on 19 May 2023 5:45 AM GMTభూమా అఖిలప్రియను ఆసుపత్రికి తరలించిన పోలీసులు
మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను హుటా హుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. టీడీపీ సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డి పై దాడి కేసులో ఆమె అరెస్టయ్యారు. కోర్టు రిమాండ్ విధించడంతో కర్నూలు సబ్ జైలుకు తరలించారు. అయితే ఆమె అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు ఆమెకు పరీక్షలు నిర్వహించారని అధికారులు తెలిపారు. అందుకు సంబంధించి రిపోర్టులు రావాల్సి ఉంది.
నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఇటీవల నంద్యాల నియోజకవర్గంలోకి రాగా.. లోకేష్‌కు స్వాగతం పలికేందుకు భూమా, ఏవీ సుబ్బారెడ్డి వర్గాలు అక్కడికి చేరుకున్నాయి. ఈ క్రమంలో ఏవీ సుబ్బారెడ్డిపై భూమా అఖిలప్రియ వర్గానికి చెందిన వ్యక్తి దాడి చేశాడు. సుబ్బారెడ్డికి గాయాలు అయ్యాయి. బుధవారం ఉదయం అఖిలప్రియ ఇంటికి వెళ్లిన నంద్యాల పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. అనంతరం ఆళ్లగడ్డ నుంచి నంద్యాలకు తరలించారు. ఈ ఘటనలపై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ ఘటనపై సీనియర్లతో ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసిన చంద్రబాబు, సమగ్ర అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.