ప్రతి శనివారం 'నో బ్యాగ్ డే', త్వరలోనే టీచర్ల బదిలీ చట్టం: లోకేశ్

ఏపీలోని స్కూళ్లలో ప్రతి శనివారం 'నో బ్యాగ్ డే'గా పాటించాలని అధికారులను రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు.

By Knakam Karthik  Published on  28 Jan 2025 9:12 PM IST
ప్రతి శనివారం నో బ్యాగ్ డే, త్వరలోనే టీచర్ల బదిలీ చట్టం: లోకేశ్

ఏపీలోని స్కూళ్లలో ప్రతి శనివారం 'నో బ్యాగ్ డే'గా పాటించాలని అధికారులను రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు. బ్యాగ్ లేకుండానే ఆ రోజు పాఠశాల జరిగేలా కో కరిక్యులమ్ యాక్టివిటీస్ రూపొందించాలని సూచించారు. పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యపై మంత్రి నారా లోకేశ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జీవో 117 ఉపసంహరణపై ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నిర్వహించిన సన్నాహక సమావేశాల్లో వచ్చిన అభిప్రాయాలను, సూచనలను ఈ సందర్భంగా అధికారులు మంత్రి నారా లోకేశ్‌కు వివరించారు. ఆయా సూచనలను పరిగణనలోకి తీసుకుని ఏ విద్యార్థి డ్రాపవుట్ అవకుండా చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. అతి త్వరలోనే చేపట్టబోయే ఉపాధ్యాయ బదిలీ చట్టంపైనా సమావేశంలో చర్చించారు. ఈ చట్టంపై ఉపాధ్యాయులు, సంఘాల నుంచి అభిప్రాయాలను సేకరించాలని సూచించారు.

పాఠశాల విద్యలో గత వైసీపీ ప్రభుత్వం అనాలోచితంగా తీసుకువచ్చిన జీవో 117 ఉపసంహరణపై క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయులు, వివిధ సంఘాల నుంచి అభిప్రాయ సేకరణ చేసిన తర్వాత అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని సూచించాలని అధికారులను ఆదేశించారు. ఉపాధ్యాయులకు ఇప్పుడున్న అనేక యాప్‌ల స్థానంలో ఒకటే యాప్‌ను రిలీజ్ చేస్తామని చెప్పారు. పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల వాస్తవ సంఖ్యను నిర్ధారించేందుకు అపార్ ఐడీని అనుసంధానించే కార్యక్రమాన్ని పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రజాభిప్రాయ సేకరణ కోసం అతి త్వరలోనే ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ బ్లూ ప్రింట్‌ను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

Next Story