ప్రభుత్వ ఉపాధ్యాయులకు మెంటర్లుగా ఇంజనీరింగ్ కళాశాలల అధ్యాపకులు
Engineering college faculty in Andhra to mentor govt teachers on IFPs. నాడు-నేడు కార్యక్రమంలో మొదటి దశలో భాగంగా, ఆంధ్రప్రదేశ్‌లోని అనేక ప్రభుత్వ పాఠశాలలు డిజిటల్‌గా
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 17 Jun 2023 9:16 PM ISTనాడు-నేడు కార్యక్రమంలో మొదటి దశలో భాగంగా, ఆంధ్రప్రదేశ్‌లోని అనేక ప్రభుత్వ పాఠశాలలు డిజిటల్‌గా మారుతున్నాయి. తరగతి గదుల్లో కీలకమైన ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ (IFP)ను ఏర్పాటు చేశారు. త్వరలో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు తమ రోజువారీ బోధనలకు సంబంధించి IFPలు, స్మార్ట్ టీవీలు, బైజూస్ లెర్నింగ్ యాప్‌లు, ట్యాబ్‌లతో సహా ఆధునిక బోధనా వ్యవస్థలను ఎలా ఉపయోగించాలో ఇంజనీరింగ్ కళాశాలల అధ్యాపకులచే శిక్షణ ఇవ్వనున్నారు.
దేశంలోనే ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ క్లాస్‌రూమ్‌లను ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించింది. రాష్ట్రవ్యాప్తంగా 10,000 తరగతి గదులు IFPలను కలిగి ఉన్నాయి. నాడు-నేడు మొదటి దశలో జూలై 12 నాటికి 15,750 పాఠశాలల్లో ఐఎఫ్‌పి, రెండో దశలో 16,000 పాఠశాలల్లో డిసెంబర్ నాటికి ఐఎఫ్‌పిలను అమర్చనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 4,59,564 మంది 8వ తరగతి విద్యార్థులకు, 59,176 మంది ఉపాధ్యాయులకు 5,18,740 ట్యాబ్‌లను పంపిణీ చేశారు. ఈ ట్యాబ్ లు శామ్‌సంగ్ కంపెనీకి చెందినవి. ఇవి ప్రీలోడెడ్ కంటెంట్‌ను కలిగి ఉంటాయి. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 778 కోట్లు ఖర్చు చేసింది. 4 నుండి 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన కంటెంట్‌ను అందించడానికి, శిక్షణా మాడ్యూల్స్‌ను అభివృద్ధి చేయడానికి, సాంకేతికతతో కూడిన బోధనకు సంబంధించి ఉపాధ్యాయులకు శిక్షణనిచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ ఎడ్-టెక్ కంపెనీ బైజూస్‌తో అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది.
ఈ ప్రాజెక్ట్ కోసం, రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కళాశాలల నుండి ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లు/అసోసియేట్ ప్రొఫెసర్లు IFPలు, బైజూస్ యాప్‌ల వినియోగంలో శిక్షణ పొందారు. పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాశ్.. జూలై మొదటి పక్షం రోజుల్లో ఒక్కో ఇంజినీరింగ్ కాలేజీలో ఒక్కో సెషన్‌కు 40 మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తామని, ఇందుకోసం స్కూల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కమిషనర్ ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా సమీపంలోని ఇంజనీరింగ్ కళాశాలకు పాఠశాలలను అనుసంధానం చేశారని తెలిపారు. సంబంధిత ఇంజినీరింగ్ కళాశాలల్లో ఉపాధ్యాయులకు వ్యక్తిగతంగా శిక్షణ కార్యక్రమాలు ఉంటాయి. శిక్షణ తర్వాత, ప్రతి ఇంజినీరింగ్ కళాశాల నుండి విద్యార్థులు వారి ఇంటర్న్‌షిప్ కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులకు సహాయం చేయడానికి సంబంధిత పాఠశాలలకు వెళతారు
ఇంజినీరింగ్ కాలేజీలే మెంటార్లు:
ప్రతి ఇంజినీరింగ్ కళాశాల దాని సమీపంలోని పాఠశాలలకు మెంటార్ ఇన్‌స్టిట్యూట్‌గా పని చేస్తుంది. ICT కాన్సెప్ట్‌లపై దృష్టి పెడుతుంది. తరువాత, మెంటర్ ఇన్‌స్టిట్యూట్‌ల నుండి వచ్చే విద్యార్థులు.. ఒక నెల పాటు స్కూల్స్ లోని విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఆన్‌సైట్ సపోర్ట్ అందించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 150 ఇంజినీరింగ్ కళాశాలల నుండి 300 మంది అధ్యాపకులకు, 26 మంది బైజూస్ జిల్లా నోడల్ ఎగ్జిక్యూటివ్‌లకు ఈ డిజిటల్ పరికరాలకు సంబంధించి వర్క్‌షాప్ నిర్వహించారు.