ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీతో పెద్ద ఎత్తున పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు రాష్ట్రానికి క్యూ కడుతున్నాయి. ఇందులో భాగంగా అనంతరం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం బేతపల్లిలో రెన్యూ అనే సంస్థ రూ. 22 వేల కోట్లతో భారతదేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ రెన్యువబుల్ పవర్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయనుంది. ఈ నెల 16వ తేదీన రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఈ భారీ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో మంత్రి లోకేశ్, రెన్యూ ఛైర్మన్ సుమంత్ సిన్హా మధ్య జరిగిన చర్చలు ఫలించడంతో పెట్టుబడులు పెట్టేందుకు రెన్యూ పవర్ ముందుకు వచ్చింది.
కాగా రెన్యూ ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్టు భారతదేశంలోనే అతిపెద్ద పునరుత్పాదక ఇంధన పెట్టుబడులలో ఒకటిగా నిలవనుందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఈ ప్రాజెక్టు తొలిదశలో రెన్యూ సంస్థ 587మెగావాట్ల సోలార్, 250 మెగావాట్ల విండ్, 415 మెగావాట్ల సామర్థ్యంగల బ్యాటరీ స్టోరేజి యూనిట్లపై రూ.7 వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. వివిధ దశల్లో 1800 మెగావాట్ల సోలార్, 1 గిగావాట్ విండ్, 2000 మెగావాట్ల సామర్థ్యంగల బ్యాటరీ స్టోరేజి యూనిట్లపై మొత్తంగా 22 వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ ప్రాజెక్టు దేశంలోనే అతిపెద్ద రెన్యువబుల్ పవర్ కాంప్లెక్స్ గా ఆవిర్భవించడమే గాక ఎపి క్లీన్ ఎనర్జీ కెపాసిటీ, గ్రిడ్ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుందని సర్కార్ భావిస్తోంది.