ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణను ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు తీవ్రంగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ, తాము ఎన్నికల విధుల్లో పాల్గొనబోమని ఎప్పుడూ చెప్పలేదని.. ఆరోగ్యం సరిగా లేని ఉద్యోగులను మినహాయించి, మిగిలిన ఉద్యోగులతో ఎన్నికలను నిర్వహించుకోవచ్చని తాము చెప్పామని అన్నారు. వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాతైతే ఉద్యోగులందరూ ఎన్నికల విధుల్లో పాల్గొనే అవకాశం ఉంటుందని చెప్పారు. ఏపీ ఎన్జీవో అధ్యక్షుదు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాతే ఎన్నికలను నిర్వహించాలని అన్నారు. ఉద్యోగుల ప్రాణాలను కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పారు. ఈ కారణం వల్లే సుప్రీంకోర్టులో తాము ఇంప్లీడ్ పిటిషన్ వేశామని తెలిపారు.

సుప్రీం తీర్పుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సుప్రీం తీర్పుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో మీడియా ప్రశ్నలకు బదులుగా ఆయన మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు తీర్పును పూర్తిగా అధ్యయనం చేస్తామని అన్నారు. పలు అంశాలను పరిశీలించిన తర్వాత సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుందనే విషయాన్ని తెలుసుకున్న తర్వాత స్పందిస్తామని తెలిపారు. ఎన్నికలను ఉద్యోగ సంఘాలు కూడా వ్యతిరేకించాయనే విషయంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందనే ప్రశ్నకు బదులుగా.. కొద్దిగా సమయం ఇస్తే. ఆ తర్వాత రియాక్ట్ అవుతామని చెప్పారు.


సామ్రాట్

Next Story