తిరుమల పాపవినాశనం రహదారిలో గత నాలుగు రోజులుగా ఏనుగులు తిష్టవేశాయి. ఆకాశ గంగ ప్రాంతంలో రోడ్డుపైకి వచ్చిన ఏనుగులు భక్తుల్ని పరుగులు పెట్టించాయి. రోడ్డుపై బైక్ పై ప్రయాణిస్తున్న వారిపై ఏనుగులు దాడికి యత్నించాయి. గజరాజుల్ని చూసి వారు తీవ్ర భయాందోళనకు గురైయ్యారు. ఈ నేపథ్యంలో కొద్ది సేపు ఈ మార్గంలో రాకపోకలను నిలిపివేశారు. సమాచారం అందుకున్న టీటీడీ, అటవీశాఖ సిబ్బంది ఏనుగులను అడవిలోకి మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఇటీవలి కాలంలో చిత్తూరు జిల్లాలో ఏనుగుల దాడులు ఎక్కువవుతున్నాయి. జోగివారిపల్లె అటవీ ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున పంటపొలాలపై ఏనుగుల గుంపు దాడి చేశాయి. రాత్రిపూట పొలం వద్ద నిద్రిస్తున్న ఎల్లప్ప అనే రైతుపై కూడా గజరాజులు దాడి చేశాయి. ఈ దాడిలో ఎల్లప్పకు తీవ్రగాయాలు కాగా.. అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఎల్లప్ప ప్రాణాలు కోల్పోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఏనుగులు తమ పంటలను నాశనం చేయడంతో పాటు పొలాల్లోని మోటార్లు, పాకలను కూడా నాశనం చేస్తున్నాయి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.