అనంతపురం జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. కరెంట్ తీగలు మీదపడి ఆరుగురు కూలీలు మృతి చెందారు. ఈ ఘటన బొమ్మనహాళ్ మండలం దర్గాహోన్నూరులో జరిగింది. దర్గాహోన్నూరు గ్రామానికి చెందిన కూలీలు పొలంలో మొక్కజొన్న కంకులు కోతకు వెళుతుండగా విద్యుత్ మెయిన్ వైర్లు ఒక్కసారిగా తెగిపడ్డాయి. కరెంట్ ప్రవహిస్తున్న తీగలు మీద పడటంతో ఆరుగురు వ్యవసాయ కూలీలు మృతి చెందారు. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. గత మూడు నెలల క్రితం ఇదే జిల్లాలోని చిలకొండయ్యపల్లి గ్రామంలో జూన్ 30న 12 మందితో వెళ్తున్న ఆటోపై విద్యుత్ తీగలు పడ్డాయి. దీంతో ఆరుగురు వ్యవసాయ మహిళా కూలీలు దుర్మరణం చెందడంతో పాటు మరో ముగ్గురు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే.