గెలుపు కోసం.. జగన్ చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారు: నారా లోకేష్
సీఎం జగన్ అయిదేళ్ల అరాచకపాలనతో జనం విసిగిపోయారని టీడీపీ నేత నారా లోకేష్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
By అంజి Published on 27 March 2024 6:13 AM GMTగెలుపు కోసం.. జగన్ చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారు: నారా లోకేష్
సీఎం జగన్ అయిదేళ్ల అరాచకపాలనతో జనం విసిగిపోయారని టీడీపీ నేత నారా లోకేష్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. జగన్ ను శాశ్వతంగా తాడేపల్లి ప్యాలెస్ లో బంధించాలని ప్రజలు నిర్ణయానికొచ్చిన నేపథ్యంలో చీప్ ట్రిక్స్ తో ప్రజాభీష్టాన్ని తారుమారు చేయాలని సీఎం జగన్ చూస్తున్నారని అన్నారు. ఎన్నికల్లో ఎలాగూ గెలవడం సాధ్యం కాదని తేలిపోవడంతో తాయిలాలతో ఓటర్లను ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రేణిగుంటలో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి చెందిన గోడౌన్ లో రాష్ట్రవ్యాప్తంగా పంపకానికి సిద్ధంగా ఉన్న చేతి గడియారాలు, స్పీకర్లు, విసనకర్రలతో పాటు మొత్తం 52 రకాల వస్తువుల డంప్‌ను అధికారులు పట్టుకున్నారని తెలిపారు.
''టీడీపీ ఫిర్యాదు చేస్తే వైసీపీ తాయిలాల డంప్ నైతే పట్టుకున్నారు.. మరి ఇసుక, లిక్కర్ లో జగన్ దోచుకొని ఎన్నికల్లో పంచడానికి సిద్ధం చేసిన డబ్బుల డంప్ ను ఎప్పుడు పట్టుకుంటారు? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంటికి కేజి బంగారం ఇచ్చినా ప్రజల్లో మీపై నెలకొన్న ప్రజాగ్రహజ్వాలలను అడ్డుకోవడం సాధ్యం కాదన్న విషయాన్ని జగన్ గుర్తించాలి'' అని నారా లోకేష్ అన్నారు.
రోజూ తన కాన్వాయ్ తనిఖీ చేసిన పోలీసులకు ఒక్క ఎన్నికల నిబంధన ఉల్లంఘన అయినా కనిపించిందా? అని నారా లోకేష్ ప్రశ్నించారు. ''సీఎం ఇంట్లోకి అన్ని నిబంధనలు అతిక్రమించి వెళ్లి వచ్చిన కంటైనర్‌ను ఎందుకు తనిఖీ చేయలేదు. అందులో ఏముంది? బ్రెజిల్ సరుకా? లిక్కర్లో మెక్కిన రూ.3 వేల కోట్లా? లండన్ పారిపోయేందుకు ఏర్పాట్లా? ఏపీ సెక్రటేరియట్‌లో ఇన్నాళ్లు దాచిన దొంగ పైళ్లా? సమాధానం చెబుతారా డీజీపీ?'' అని నారా లోకేష్ ట్వీట్ చేశారు.