ఏపీలో నేటి నుంచి 18 గంటల కర్ఫ్యూ.. మార్గదర్శకాలు ఇవే
Eighteen hours curfew in AP starts from today.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిరోజూ 18 గంటల చొప్పున కర్ఫ్యూ అమలు కానుంది.
By తోట వంశీ కుమార్ Published on 5 May 2021 8:12 AM ISTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి శరవేగంగా విజృంభిస్తోంది. నిత్యం వేలల్లో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో ఈ మహమ్మారి కట్టడే లక్ష్యంగా ప్రభుత్వం నివారణా చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇప్పటికే సాయంత్రం కర్ఫ్యూ అమలు చేస్తుండగా.. నేటి నుంచి పగటిపూట కర్ఫ్యూ కూడా అమలుకానుంది. దీంతో రాష్ట్రంలో ప్రతిరోజూ 18 గంటల చొప్పున కర్ఫ్యూ అమలు కానుంది. అంటే.. ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. అదేవిధంగా ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఈ ఆంక్షలు రెండు వారాలపాటు అమల్లో ఉండనున్నాయి.
పాక్షిక లాక్‌డౌన్‌లో భాగంగా మధ్యాహ్నం 12 గంటల తర్వాత అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత అంతర్రాష్ట్ర, దూర ప్రాంత బస్సులు పూర్తిగా నిలిపివేస్తున్నట్లు మంత్రి పేర్ని నాని వెల్లడించారు. మరోవైపు మద్యం అమ్మకాల వేళలు కుదించారు. ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే మద్యం దుకాణాలు ఉంటాయని రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఉత్తర్వులు జారీ చేసింది. కర్ఫ్యూ అమలు బాధ్యతలను కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు అప్పగించారు. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటారు.
కర్ఫ్యూ నుంచి మినహాయింపు వీటికే..
ఆస్పత్రులు, డయాగ్నస్టిక్ ల్యాబ్‌లు, మెడికల్ షాపులు, ఎల్‌పీజీ, సీఎన్‌జీ, గ్యాస్ ఔట్‌లెట్‌లు, విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ సంస్థలు, ప్రింట్ –ఎల్రక్టానిక్ మీడియా, టెలికమ్యూనికేషన్స్, ఇంటర్‌నెట్, బ్రాడ్‌కాస్టింగ్, ఐటీ సేవలు, పెట్రోల్ బంకులు, నీటి సరఫరా, పారిశుధ్య సేవలు, కోల్డ్ స్టోరేజీలతోపాటు గిడ్డంగులు, ప్రైవేటు సెక్యూరిటీ సర్వీసులు, అన్ని ఉత్పాదక సంస్థలు, వ్యవసాయ ఉత్పత్తుల సేకరణతోపాటు అన్ని వ్యవసాయ పనులు. ఇవన్నీ కొవిడ్ నిబంధనలు పాటిస్తూ తమ కార్యకలాపాలు నిర్వహించుకోవాలి.