బీసీ రక్షణ చట్టం రూపకల్పన.. రేపు ఎనిమిది మంది మంత్రుల కీల‌క‌ సమావేశం

బీసీలకు మేలు కలిగేలా సీఎం చంద్రబాబు నాయుడు మరో నిర్ణయం తీసుకోనున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు.

By Kalasani Durgapraveen  Published on  15 Oct 2024 1:20 PM GMT
బీసీ రక్షణ చట్టం రూపకల్పన.. రేపు ఎనిమిది మంది మంత్రుల కీల‌క‌ సమావేశం

బీసీలకు మేలు కలిగేలా సీఎం చంద్రబాబు నాయుడు మరో నిర్ణయం తీసుకోనున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. బీసీ డిక్లరేషన్లో భాగంగా బీసీ రక్షణ చట్టం రూపకల్పనపై ఎనిమిది మంది బీసీ మంత్రుల సమావేశం బుధవారం నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయం అయిదో బ్లాక్ కాన్ఫరెన్స్ హాల్లో ఈ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు మంగళవారం మంత్రి సవిత ఒక ప్రకటన విడుదల చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం మాదిరిగా బీసీల రక్షణకు చట్టం చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారన్నారు. బీసీ డిక్లరేషన్ లోనూ రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ కూడా హామీ ఇచ్చిన విషయాన్ని మంత్రి సవిత గుర్తు చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడుతూ బీసీ రక్షణ చట్టం విధివిధానాల రూపకల్పనకు చంద్రబాబు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఇందులో భాగంగా బుధవారం మధ్యాహ్నం అమరావతి రాష్ట్ర సచివాలయంలో ఎనిమిది మంది బీసీ మంత్రులు సమావేశమవుతున్నట్లు మంత్రి వెల్లడించారు. తనతో పాటు మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, సత్య కుమార్ యాదవ్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, సుభాష్, కొండపల్లి శ్రీనివాస్ పాల్గొంటున్నారని తెలిపారు. రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నట్లు మంత్రి సవిత తెలిపారు. బీసీ రక్షణ చట్టం విధివిధానాల రూపకల్పనపై ఈ సమావేశంలో చర్చిస్తామని, తీసుకున్న నిర్ణయాలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని వెల్లడించారు. త్వరలోనే బీసీ రక్షణ చట్టం అమలయ్యేలా సీఎం చంద్రబాబు నాయుడు కృతనిశ్చయంతో ఉన్నారని మంత్రి సవిత తెలిపారు.




Next Story