తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది
EC Issued MLC Elections Schedule for Telugu States.తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది
By తోట వంశీ కుమార్
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఏపీ, తెలంగాణలోని పట్టభద్రులు, స్థానిక సంస్థల్లో త్వరలో ఖాళీ కానున్న, ఇప్పటికే ఖాళీ అయిన స్థానాలకు ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 పట్టభద్రులు, 2 ఉపాధ్యాయ, 8 స్థానిక సంస్థల స్థానాలు.. తెలంగాణలో ఒక ఉపాధ్యాయ, ఒక స్థానిక సంస్థల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
ఈ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 16న నోటిఫికేషన్‌ను విడుదల చేయనుండగా, 23 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 24న నామినేషన్లను పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు 27 చివరి తేదీ. మార్చి 13న ఎన్నికలు నిర్వహించనుండగా, మార్చి 16న ఓట్ల లెక్కింపు చేపట్టి అదే రోజు ఫలితాలను ప్రకటించనున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రకాశం- నెల్లూరు- చిత్తూరు( పట్టభద్రుల నియోజకవర్గం), కడప- అనంతపురం-కర్నూలు( పట్టభద్రుల నియోజకవర్గం), శ్రీకాకుళం- విజయనగరం- విశాఖపట్నం( పట్టభద్రుల నియోజకవర్గం), ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు (ఉపాధ్యాయ నియోజక వర్గం), కడప-అనంతపురం- కర్నూలు (ఉపాధ్యాయ నియోజక వర్గం) ఈసీ ఎన్నికలు నిర్వహించనుంది. అనంతపురం, కడప, నెల్లూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, శ్రీకాకుళం, చిత్తూరు, కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి.
ఇక తెలంగాణలో హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ ఉపాధ్యాయ స్థానంతో పాటు హైదరాబాద్ స్థానిక సంస్థల స్థానంలో ఎన్నికలు జరుగుతాయి.