శ్రీకాకుళం జిల్లాలో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. మంగళవారం రాత్రి ఇచ్చాపురం నియోజకవర్గంలోని ప్రజలు రాత్రంతా ఏం జరుగుతుందో అర్థంకాక కంటిమీద కునుకు లేకుండా చలిలోనే వీధుల్లో చంటిబిడ్డలతో జాగారం చేశారు. వారం రోజుల వ్యవధిలో రెండో సారి ప్రకపంనలు రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
మంగళవారం రాత్రి 10.15 గంటల సమయంలో మూడు సెకన్ల పాటు భూమి కంపించింది. ఇచ్చాపురం, కంచిలి, కవిటి మండలాల్లోని రత్తకర్ణ, తేలుకుంచి, అమీన్‌సాహిబ్ పేట, పురుషోత్తపురం గ్రామాల్లో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దీంతో స్థానికులు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రాత్రి అంతా చలిలోనే చంటి బిడ్డలతో జాగారం చేశారు. మూడుసార్లు భూమి కంపించిందని స్థానికులు చెబుతున్నారు. దీనిపై తహసీల్దారు శ్రీహరి బాబు మాట్లాడుతూ.. ప్రకంపనలు వచ్చినట్లు సమాచారం వచ్చిందని.. అయితే తీవ్రత చాలా తక్కువ అని చెప్పారు. కవిటి, డి.జి.పుట్టుగ, ప్రగడపుట్టగ, ఇద్దవానిపాలెం, జగతి, రాజపురం, బెలగాంతో పాటు మరో పది గ్రామాల్లో భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు.