'ఈ-వాచ్‌' యాప్ ప్రారంభించిన నిమ్మగడ్డ.. యాప్‌పై హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం

E Watch App For AP Elections. ఈ యాప్‌ను విజయవాడలోని ఎన్నికల సంఘం కార్యాలయంలో ఈ రోజు ఎస్ఈసీ‌ నిమ్మగడ్డ రమేశ్ ‌కుమార్ ప్రారంభించారు.

By Medi Samrat  Published on  3 Feb 2021 8:49 AM GMT
E Watch App For AP Elections.

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నిక‌ల ప్ర‌క్రియ కొనసాగుతోన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఫిర్యాదుల స్వీకరణకు 'ఈ-వాచ్‌' పేరిట ఓ యాప్ తీసుకొచ్చారు. ఈ యాప్‌ను విజయవాడలోని ఎన్నికల సంఘం కార్యాలయంలో ఈ రోజు ఎస్ఈసీ‌ నిమ్మగడ్డ రమేశ్ ‌కుమార్ ప్రారంభించారు.

అనంత‌రం మాట్లాడుతూ.. ఈ -వాచ్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చ‌ని, అక్రమాలు, ప్రలోభాలపై నేరుగా స‌మాచారం అందించ‌వ‌చ్చ‌ని తెలిపారు. ఫిర్యాదులు చేసిన వారి వివ‌రాల‌ను గోప్యంగా ఉంచుతామ‌ని తెలిపారు. ఫిర్యాదులను పరిష్కరించిన అనంత‌రం ఆ వివ‌రాల‌ను ఫిర్యాదుదారుల‌కు చెబుతామని పేర్కొన్నారు. ఈ యాప్ రేప‌టి నుంచి ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉంటుందని వివ‌రించారు.

అయితే.. ఎస్‌ఈసీ రూపొందించిన ఈ-వాచ్ యాప్‌పై ఏపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్‌ను దాఖలు చేసింది. ఏపీ ప్రభుత్వ పిటిషన్‌పై రేపు విచారణ జరుపుతామని ధర్మాసనం పేర్కొంది. భద్రతాపరమైన అనుమతులు లేకుండా యాప్‌ను రహస్యంగా తయారు చేశారని పిటిషన్‌లో ప్రభుత్వం పేర్కొంది.

ప్రభుత్వ వ్యవస్థలో యాప్‌లు, సాఫ్ట్‌వేర్లు ఉపయోగించాలంటే అనుమతి తప్పనిసరిగా ఉండాలని తెలిపింది. సెక్యూరిటీ సమస్యలు, హ్యాక్‌ అయ్యే అవకాశం ఉందని ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. పంచాయతీరాజ్‌శాఖ యాప్ ఉండగా.. ఈ-వాచ్‌ యాప్‌ ఎందుకని ప్రశ్నించింది. కొన్ని పార్టీలకు లబ్ది చేకూర్చేలా 'ఈ-వాచ్‌' యాప్‌ ఉందని ఏపీ ప్రభుత్వం పిటిషన్‌లో పేర్కొంది.




Next Story