విశాఖపట్నం సింహాచంలోని సింహగిరిపై ఉన్న సింహాచల దేవస్థానం ఉప దేవాలయం శ్రీ సీతారామస్వామి సన్నిధిలోని ధ్వజస్తంభం విరిగి పడిపోయింది. బుధవారం తెల్లవారుజామున ఆకస్మాత్తుగా కూలిపోయింది. ఆ సమయంలో భక్తులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ధ్వజస్తంభం కూలడంతో అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే సీసీ టీపీ పుటేజీ సహాయంతో కారణాలపై పరిశీలించారు. ఎవరి ప్రమేయం లేదని నిర్ధాంచుకున్న అనంతరం అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
పురాతనమైన ఈ ధ్వజస్తంభం లోపలి కర్ర పుచ్చి పోవడంతో అది కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. సుమారుగా 60ఏళ్ల క్రితం దీన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. వేదమంత్రాలు, సంప్రోక్షణ తరువాత ధ్వజస్తంభం స్థానంలో తాత్కాలిక ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేశారు. పది రోజుల్లో శాశ్వత ధ్వజస్తంభం ఏర్పాటు చేస్తామని ఈఓ సూర్యకళ తెలిపారు.