Vijayawada: దసరా మహోత్సవాలు ప్రారంభం.. భక్తులతో కిక్కిరిసిన ఇంద్రకీలాద్రి
ఇంద్రకీలాద్రిపై ఆదివారం తెల్లవారుజాము నుంచి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. 23వ తేదీ వరకు దసరా మహోత్సవాలు జరగనున్నాయి.
By అంజి Published on 15 Oct 2023 10:36 AM ISTVijayawada: దసరా మహోత్సవాలు ప్రారంభం.. భక్తులతో కిక్కిరిసిన ఇంద్రకీలాద్రి
ఇంద్రకీలాద్రిపై ఆదివారం తెల్లవారుజాము నుంచి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 23వ తేదీ వరకు దసరా మహోత్సవాలు జరగనున్నాయి. తొమ్మిది రోజుల పాటు పది అలంకారాలలో కనకదుర్గమ్మ దర్శనమివ్వనున్నారు. తొలిరోజు ఆదివారం శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల నుంచి అమ్మవారి స్నపనాభిషేకం, అలంకరణ ప్రత్యేక పూజల అనంతరం ఉదయం తొమ్మిది గంటల నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులకు అనుమతిస్తారు.
బాలా త్రిపుర సుందరీ దేవి అమ్మవారి దర్శనం కోసం భక్తుల బారులు తీరారు. ఇంద్రకీలాద్రి భక్తులతో కిక్కిరిసిపోయింది. దసరా ఉత్సవాలతో ఇంద్రకీలాద్రి చుట్టు పక్కల ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఇదిలా ఉంటే.. ఇవాళ ఉదయం విజయవాడ కనక దుర్గమ్మను ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ సతీసమేతంగా దర్శించుకున్నారు. గవర్నర్ దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అంతరాలయంలో గవర్నర్ దంపతులు ప్రత్యేక పూజలు జరిపారు. ఆదివారం, అలాగే దసరా సెలవులతో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ పెరిగింది.
- నేడు అక్టోబర్ 15న శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవి
- అక్టోబర్ 16న శ్రీ గాయత్రీ దేవి
- అక్టోబర్ 17న అన్నపూర్ణాదేవి
- అక్టోబర్ 18న శ్రీ మహాలక్ష్మి దేవి
- అక్టోబర్ 19న శ్రీ మహాచండీ దేవి
- అక్టోబరు 20న మూలానక్షత్రం రోజున సరస్వతీ దేవి
- అక్టోబర్ 21న శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి
- అక్టోబరు 22న శ్రీ దుర్గాదేవి అలంకారాల్లో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు.
అక్టోబరు 23 విజయదశమి రోజున రెండు అలంకారాలలో అమ్మవారు దర్శనమివ్వనున్నారు. ఉదయం శ్రీ మహిషాసురమర్ధనీ దేవిగా, మధ్యాహ్నం శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారాలలో దుర్గమ్మ దర్శనమివ్వనున్నారు. సాయంత్రం కృష్ణానదిలో శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల తెప్పోత్సవం జరగనుంది. దసరా ఉత్సవాలకు 8 లక్షల మందికిపైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేశారు. దీంతో వినాయకుని గుడి నుంచి దుర్గమ్మ సన్నిధానం వరకు నాలుగు క్యూలైన్లు ఏర్పాటు చేశారు.
భక్తుల రద్దీ దృష్ట్యా అంతరాలయ దర్శనం నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. 5 వేల మందితో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కమాండ్ కంట్రోల్ రూం ద్వారా క్యూలైన్లను మానిటరింగ్ చేస్తున్నారు. వృద్ధులకు, వికలాంగుల కోసం బ్యాటరీ కార్లు అందుబాటులో ఉంచారు. అలాగే ఘాట్లలో పుణ్య స్నానాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.