వైఎస్‌ జగన్‌కు రామ భక్తులు ఓటెయ్యాలా?: అమిత్‌ షా

హిందువుల ఆధార్య దైవం, మర్యాదపురుషోత్తముడై శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠకు ఆహ్వానం పంపితే సీఎం వైఎస్‌ జగన్‌ పట్టించుకోలేదని అమిత్‌ షా ఆరోపించారు.

By అంజి  Published on  5 May 2024 3:00 PM IST
election campaign, Dharmavaram, Amit Shah, CM Jagan, APnews

వైఎస్‌ జగన్‌కు రామ భక్తులు ఓటెయ్యాలా?: అమిత్‌ షా

దేశంలో తొలి రెండు దశల సార్వత్రిక ఎన్నికల అనంతరం నరేంద్ర మోదీ సెంచరీ కొట్టి 400 సీట్లకు పైగా సాధించే దిశగా ముందుకు సాగుతున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారంలో అన్నారు. రాష్ట్రంలోని ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల ర్యాలీని ఉద్దేశించి అమిత్‌ షా మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి, ఇసుక, భూ మాఫియాలు మరియు నేరాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సిపి)పై విమర్శల దాడి చేశారు.

హిందువుల ఆధార్య దైవం, మర్యాదపురుషోత్తముడై శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠకు ఆహ్వానం పంపితే సీఎం వైఎస్‌ జగన్‌ పట్టించుకోలేదని అమిత్‌ షా ఆరోపించారు. ''రాహుల్‌, జగన్‌ ఇద్దరూ ఈ ఆహ్వానాలు పట్టించుకోలేదు. వీళ్లిద్దరూ రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి రాలేదు. ఇలాంటి జగన్‌కు రామ భక్తులైన ఏపీ ప్రజలు ఓటు వేయాలా?'' అని అమిత్‌ షా ప్రశ్నించారు. రాష్ట్రంలో అవినీతి, నేరాలు, మాఫియా, మతమార్పిడులకు వ్యతిరేకంగా బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి చేస్తున్న పోరాటానికి బలం చేకూర్చేందుకే తాను ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నానని హోంమంత్రి తెలిపారు.

రాష్ట్రంలో గూండాలు, నేరగాళ్ల పాలన, విచ్చలవిడిగా సాగుతున్న అవినీతి, ఇసుక మాఫియాను అంతమొందించేందుకు, అమరావతిని మరోసారి రాజధానిగా చేసేందుకు తాము కూటమిని ఏర్పాటు చేశామన్నారు. చంద్రబాబు ఏపీని ప్రగతి పథంలో నిలిపితే.. జగన్‌ భ్రష్టుపట్టించారని అమిత్‌ షా ఆరోపించారు. ఉమ్మడి ఏపీనీ చంద్రబాబు నెంబర్‌ వన్‌ నిలిపారని అన్నారు. చంద్రబాబు చేపట్టిన అభివృద్ధిని జగన్‌ అధోగతి పట్టించారని అన్నారు. మద్యం నిషేధం చేస్తానని జగన్‌ మాట తప్పారని, మద్యం సిండికేట్‌కు తెరలేపారని అమిత్‌ షా ఆరోపించారు. అట్టహాసంగా ఆరోగ్యశ్రీ ప్రకటించి నిధులు ఇవ్వకుండా నిర్వీర్యం చేశారని ధర్మవరం సభలో అమిత్‌ షా మండిపడ్డారు.

మోడీని మూడోసారి ప్రధానిని చేయాలని దేశం మొత్తం నిర్ణయించుకుందని, రాహుల్ గాంధీతో సహా భారత కూటమి నాయకులెవరూ దేశాన్ని నడిపించే అర్హత లేదని షా అన్నారు.

Next Story