పునరావాసం, పునరావాస ప్యాకేజీ కింద పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాలకు పరిహారం పెంచింది వైసీపీ ప్రభుత్వమేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ఆ మేరకు ప్రభుత్వం జీవో కూడా జారీ చేసిందని తెలిపారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల మూడో రోజు సోమవారం పోలవరంపై చర్చ సందర్భంగా టీడీపీ విమర్శలు, ఆరోపణలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. సీఎం జగన్ 2021 జూన్ 30 నాటి జీవో కాపీని టీడీపీ సభ్యులకు చూపించి, తన మాటకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు.
ఆర్ అండ్ ఆర్ కింద గత ప్రభుత్వం రూ.6.86 లక్షలు పరిహారాన్ని ప్రకటిస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.10 లక్షలకు పెంచామని వైఎస్ జగన్ అన్నారు. ప్రభుత్వం వెచ్చిస్తున్న 500 కోట్ల రూపాయలకు మించి పునరావాసం పూర్తి కాగానే పోలవరం బాధితులకు పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబే నాశనం చేశారన్న సీఎం జగన్.. ప్రస్తుత ప్రభుత్వం మరమ్మతులు చేసేందుకు నానాతంటాలు పడుతోందని మండిపడ్డారు.
కేంద్రం నుంచి రూ.2,900 కోట్ల నిధులు రావాల్సి ఉందని, ఆ నిధులను అడ్డుకోవడం వెనుక చంద్రబాబు హస్తం ఉందని సీఎం జగన్ ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టుపై ఏ ప్రభుత్వానికి అంకితభావం ఉందో పోలవరం ప్రాజెక్టు గణాంకాలు వెల్లడిస్తాయని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి అసెంబ్లీలో వీడియో ప్రసారం చేశారు.