డీఎస్సీ–2024 పరీక్షల షెడ్యూల్‌ను మార్చిన ఏపీ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డీఎస్సీ -2024 పరీక్షల షెడ్యూల్‌ను మార్చింది.

By Srikanth Gundamalla  Published on  10 March 2024 1:21 AM GMT
dsc-2024, exam schedule,  andhra pradesh, government,

డీఎస్సీ–2024 పరీక్షల షెడ్యూల్‌ను మార్చిన ఏపీ ప్రభుత్వం 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డీఎస్సీ -2024 పరీక్షల షెడ్యూల్‌ను మార్చింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉపాధ్యాయుల నియామకం కోసం నిర్వహిస్తున్న డీఎస్సీ-2024 పరీక్షలను ఈనెల 30 నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు నిర్వహించేలా కొత్త షెడ్యూల్‌ను రూపొందించింది. ఈ మేరకు వివరాలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్. సురేశ్‌ కుమార్‌ ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 6,100 టీచర్‌ పోస్టుల ఖాళీల భర్తీకి గతంలోనే నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతోపాటు టెట్‌ పరీక్ష నోటిఫికేషన్ విడుదల చేయగా.. ఈ పరీక్షను ప్రభుత్వం నిర్వహించింది.

మొదట విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం అయితే.. డీఎస్సీ పరీక్షలు ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. కానీ.. టెట్‌ పరీక్షకు.. డీఎస్సీ పరీక్షకు నాలుగు వారాల సమయం ఉండాలని హైకోర్టు ఇటీవల ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే డీఎస్సీ-2024 పరీక్షల షెడ్యూల్లో మార్పులు చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. కొత్త షెడ్యూల్‌ను రూపొందించామని సురేశ్ కుమార్ తెలిపారు. ఏప్రిల్‌లో ఐఐటీ జేఈఈ సహా ఇతర ఎంట్రెన్స్‌ పరీక్షుల ఉంటాయనీ.. దాంతో పరీక్ష కేంద్రాలు అందుబాటులో ఉండకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేశారు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేశ్. అందుకే మార్చి 30వ తేదీ నుంచి ఏప్రిల్ 30 వరకు డీఎస్సీ-2024 పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. అభ్యర్థులు ప్రిపేర్ అవ్వడానికి తగిన సమయం ఉంది కాబట్టి.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనిఆయన సూచించారు.

డీఎస్సీ-2024 కొత్త షెడ్యూల్:

* మార్చి 30 నుంచి ఏప్రిల్ 3 వరకు రోజుకు రెండు సెషన్ల చొప్పున 10 సెషన్లలో సెకండరీ గ్రేడ్‌ టీచర్ పరీక్ష

* ఏప్రిల్ 7 టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్ పోస్టులకు ప్రాథమిక పరీక్ష అయిన ఇంగ్లీష్ ప్రొఫీషియన్సీ టెస్టు

* ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 30 వరకు స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీ, ఫిజికల్ డైరెక్టర్, ప్రిన్సిపల్ పరీక్షలు

* మార్చి 20 నుంచి పరీక్ష రాయడానికి అభ్యర్థులకు సెంటర్లు ఎంచుకునేందుకు వెబ్ ఆప్షన్స్

* మార్చి 25 నుంచి అభ్యర్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం

* జీవో-11లో అర్హతలు మారుస్తూ కొత్తగా జీవో-22ను విడుదల.. వివరాలను DSC https:// apdsc. apcfss. in/ వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చునని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ తెలిపారు.

Next Story