తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామి ఆలయంలో నిన్న రాత్రి ఓ వ్యక్తి మద్యం మత్తులో హల్‌చల్ చేశాడు. గోపురం ఎక్కి కలశాలు లాగడంతో వాటిలో రెండు ధ్వంసమయ్యాయి. ఏకాంత సేవ ముగిసిన తర్వాత భద్రతా సిబ్బంది కళ్లుగప్పి అతడు ఆలయంపైకి వెళ్లాడు. క్వార్టర్ మద్యం ఇస్తేనే దిగుతానంటూ షరతులు పెట్టాడు. పోలీసులు 3 గంటల పాటు శ్రమించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా కూర్మ వాడ , పెద్దమల్లా రెడ్డి కాలనీకి చెందిన కుత్తడి తిరుపతిగా గుర్తించారు.
ఆలయం గోపురం పైనుంచి కిందికి దించేందుకు మూడు గంటలు పాటు తిరుపతి ఈస్ట్ పోలీసులు, ఫైర్ సిబ్బంది శ్రమించారు. క్వార్టర్ మద్యం బాటిల్ ఇస్తేనే ఆలయం గోపురం పై నుంచి కిందికి దిగుతాను అంటూ సదరు వ్యక్తి షరతులు పెట్టాడు. గోపురానికి ఫైర్ సిబ్బంది ఐరన్ నిచ్చెనలు వేసి అతడిని అదుపులోకి తీసుకుని ఈస్ట్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అతడిని విచారించిన తర్వాత అన్ని విషయాలు బయటకు వెల్లడిస్తాము అని ఈస్ట్ డీఎస్పీ భక్తవత్సలం తెలిపారు.