శ్రీకాకుళంలోని భావనపాడు బీచ్‌లో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు డ్రోన్ జెట్ నీటిపై తేలుతూ కనిపించింది. అదీ విదేశాలకు చెందిన డ్రోన్ జెట్ లాగా కనిపించడంతో కలకలం రేపింది. దీంతో వారు వెంటనే మెరైన్ పోలీసులకు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన మెరైన్ పోలీసులు.. ఈ డ్రోన్‌ను ఎవరు ఉపయోగించారు, ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై ఆరా తీస్తున్నారు. అయితే పోలీసులు దానిపై ఉన్న అక్షరాల ఆధారంగా కోడింగ్ చేసి, అది విదేశీయనా లేదా స్వదేశీనా అని తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
ఢిల్లీ ఉన్నతాధికారులకు కూడా సమాచారం అందించారు. మరోవైపు వాతావరణ శాఖకు చెందిన అంతరిక్ష పరిశోధనల్లో శాస్త్రవేత్తలు ఇలాంటి డ్రోన్ జెట్‌లను వినియోగిస్తున్నట్లు సమాచారం. అయితే దీనిని ఎవరు ఉపయోగించారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఈస్ట్ కోస్ట్ నేవల్ అధికారులు కూడా డ్రోన్ పై విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో కెమెరాలు లేవు కానీ రేడియో సిగ్నల్స్ పంపే కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్నాయి. భావనపాడు కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ సీఐ జి.దేవుళ్లు మాట్లాడుతూ.. ''ఈ విషయాన్ని నేవీ, నిఘా వర్గాలకు తెలియజేశాం. ఆ బృందాలు కూడా పరిశీలించేందుకు వస్తున్నాయి'' అని చెప్పారు.
111 కిలోల బరువున్న ఈ డ్రోన్‌ను జనవరి 28న నిఘా కోసం ప్రయోగించగా, అది విఫలమై సముద్రంలో పడిపోయి ఉండవచ్చని పోలీసులు తెలిపారు.