తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవనాడు అలంకరించేందుకు చెన్నై నుంచి తిరుమలకు చేరుకునే గొడుగుల ఊరేగింపులో భక్తులు ఎలాంటి కానుకలు అందించరాదని టీటీడీ కోరింది. భక్తులు అందించే కానుకలు టీటీడీకి చేరవని, కానుకలతో టీటీడీకి ఎలాంటి సంబంధమూ లేదని తెలిపింది. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో పలు హిందూ సంస్థలు చెన్నై నుంచి గొడుగులను ఊరేగింపుగా తిరుమలకు తీసుకొచ్చి స్వామివారికి సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది.
ఈ గొడుగులు అక్టోబరు 7న తిరుమలకు చేరుకుంటాయి. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజు శనివారం రాత్రి శ్రీ మలయప్పస్వామివారు హంస వాహనంపై వీణ ధరించి సరస్వతి దేవి అలంకారంలో దర్శనమిచ్చారు. మాడ వీధుల్లో అంగరంగ వైభవంగా జరిగిన వాహనసేవలో వివిధ కళాబృందాల ప్రదర్శనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని వాహనసేవలో దర్శించుకున్నారు.