ఇక నుంచి తిరుమల లడ్డూ ప్రసాదాలపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదని టీటీడీ పేర్కొంది. తెలిసీ తెలియక జరిగిన దోషాలు శాంతి హోమం, సంప్రోక్షణతో పోయాయని చెప్పింది. మార్చిన నెయ్యితోనే లడ్డూలు చేస్తున్నామని వెల్లడించింది. ప్రసాదాల తయారీ కేంద్రాలతో పాటు ఆలయంలోని అన్ని విభాగాల్లో సంప్రోక్షణ చేశామని తెలిపింది.
శ్రీవారి లడ్డూ కల్తీ ఘటన నేపథ్యంలో తిరుమల ఆలయంలో అర్చకులు ప్రాయశ్చిత హోమం చేశారు. వాస్తు శుద్ధి, శాంతి హోమం ముగిసింది. ఆ తర్వాత అన్ని పోటుల్లో సంప్రోక్షణ చేశారు. మరోవైపు లడ్డూ కల్తీపై సిట్ దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశించింది. అందుకు సంబంధించిన విధివిధానాలను రూపొందించి, ఇవాళ సాయంత్రానికి దర్యాప్తు అధికారి పేరుతో జీవో విడుదల చేయనున్నట్టు సమాచారం.
గత ప్రభుత్వ హయాంలో తిరుపతి లడ్డూల తయారీలో జంతువుల కొవ్వులు వాడారని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే శాంతి హోమం చేశారు. ఈ ఆచారం ఉదయం 6 గంటలకు ప్రారంభమై 10 గంటల వరకు కొనసాగింది. ఈ ఆచారాల వల్ల దుష్ఫలితాలు దూరమవుతాయని, శ్రీవారి భక్తుల శ్రేయస్సుతోపాటు లడ్డూ ప్రసాదాల పవిత్రతను పునరుద్ధరిస్తాయని టీటీడీ కార్యనిర్వహణాధికారి జె శ్యామలరావు తెలిపారు.