అంతరించిపోతున్న జంతువుల జాబితాలో త్వరలో గాడిదలు కూడా చేరనున్నాయా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి, ప్రకాశం జిల్లాల్లో వేల సంఖ్యలో కనిపించిన గాడిదలు ప్రస్తుతం 5 వేలకు పరిమితం అయ్యాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో గాడిదలను జూలకు వెళ్లి చూడాల్సిన దుస్థితి నెలకొనే ప్రమాదం ఉందని జంతు సంరక్షణ సంస్థ (ఎన్‌జీవో) కార్యదర్శి గోపాల్ ఆర్ సురబత్తుల ఆందోళన వ్యక్తంచేశారు. అంతరించిపోతున్న గాడిద సంతతిని రక్షించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
ఒకప్పుడు విరివిరిగా కనిపించిన గాడిదలు.. ఇప్పుడు అంతరించిపోతున్న జాబితాలోకి వెళ్లిపోయేలా కనిపిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం ఏంటని ఆరా తీస్తే.. మాంసం కోసం వీటిని వధిస్తున్నారని తెలిసింది. గాడిద మాంసం తింటే శరీర దారుఢ్యం పెరుగుతుందని, దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయని, లైంగిక శక్తి, వీర్య పుష్టి కలుగుతుందనే అపోహలే గాడిదల మనుగడకు శాపంగా మారాయి. నిజానికి గాడిదలను చంపి తినడం నేరం. అయితే.. గాడిద మాంసానికి పెద్ద ఎత్తున డిమాండ్ ఉండడంతో కొంత మంది వ్యాపారులు వీటిని కర్ణాటక, తమిళనాడు, రాజస్థాన్ వంటి రాష్ట్రాలకు అక్రమంగా తరలిస్తున్నారని తెలిసింది. గాడిద పాలు, మాంసం వినియోగంపై ప్రజల్లో ఉన్న అపోహలు వీడాలని పలువురు కోరుతున్నారు.