ఇంటర్ విద్యార్ధులకు గుడ్‌న్యూస్.. కాలేజీల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం ప్రారంభం
రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియేట్ విద్యార్ధుల మద్యాహ్న భోజన పధకం అమలుగా ఈఏడాది 27.39 కోట్లు, వచ్చే విద్యాసంవత్సరంలో రూ. 85.84 కోట్లు ప్రభుత్వం ఖర్చుచేయనున్నదని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి వెల్లడించారు.
By Medi Samrat Published on 4 Jan 2025 3:28 PM ISTరాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియేట్ విద్యార్ధుల మద్యాహ్న భోజన పధకం అమలుగా ఈఏడాది 27.39 కోట్లు, వచ్చే విద్యాసంవత్సరంలో రూ. 85.84 కోట్లు ప్రభుత్వం ఖర్చుచేయనున్నదని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి వెల్లడించారు. శనివారం నూజివీడు ముడుపల్లి తాతయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పధకాన్ని రాష్ట్ర మంత్రి కొలుసు పార్ధసారధి ప్రారంభించారు. ఈ సందర్బంగా విద్యార్ధులతో కలిసి మంత్రి మధ్యాహ్న భోజనం చేశారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. విద్యా వ్యవస్ధలో విప్లవాత్మకమైన మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రైవేటు విద్యా సంస్ధలకు ధీటుగా ప్రభుత్వ విద్యా సంస్ధలను అభివృద్ధి పరుస్తుందన్నారు. విద్యార్ధులు బాగా చదువుకొని ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకుంటూ మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు పొంది తద్వారా తమ కుటుంబాలను బాగా చూచుకోవాన్నారు. ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్ధుల హజరుశాతం, ఫలితాల మెరుగుదలకు ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందన్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యానభ్యసిస్తున్న 1,48,419 మంది ఇంటర్మీడియేట్ విద్యార్ధులకు నేటి నుంచి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పధకాన్ని అమలు చేయడాన్ని నిర్ణయించడం జరిగిందన్నారు. ఇందుకోసం ఈఏఢాది రూ. 27.39 కోట్లు, వచ్చే విద్యా సంవత్సరంలో రూ. 85.84 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేయనుందన్నారు. అదే విదంగా ఏలూరు జిల్లాలో 19 జూనియర్ కళాశాలల్లో 3,734 మంది విద్యార్ధులు ఉన్నారని వారిలో నూజివీడు జూనియర్ కళాశాలలో 410 మంది విద్యార్ధులు ఉన్నారన్నారు. ప్రైవేట్ కళాశాలలకు ధీటుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలను దిర్చిదిద్దేందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయన్నారు.
ఈ ఏడాది రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, ఎపి మోడల్ స్కూళ్లు, కస్తూరిభా గాంధీ విద్యాలయాలు, హైస్కూల్స్ ప్లెస్ స్కూళ్లలో విద్యనభ్యసిస్తున్న 2 లక్షల మందికి పైగా ఇంటర్ విద్యార్ధులకు ప్రభుత్వం ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, స్కూల్ బ్యాగ్స్ ప్రభుత్వం పంపిణీ చేసిందన్నారు. భోదనా విధానాన్ని మెరుగుపర్చేందుకు జిల్లా, రీజనల్ స్ధాయిలో అకడమిక,గైడెన్స్ అండ్ మోనాటరింగ్ సెల్ ను ఏర్పాటు చేశారన్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుండి ఎంసెట్, నీట్ పరీక్షల మెటీరియల్, ప్రాక్టికల్ రికార్డులు, పుస్తకాలు, ఇంటర్ విద్యార్ధులకు స్టూడెంట్ కిట్లను విద్యార్ధులకు అందజేయనున్నట్లు రాష్ట్ర మంత్రి పార్ధసారధి తెలిపారు. అదే విధంగా మనబడి-మన భవిష్యత్ పదకం కింద రాష్ట్రంలో 447 కళాశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 307.76 కోట్ల అంచనాలతో పనులను ప్రతిపాధించగా ఇందుకోసం ఇప్పటివరకు రూ. 169.69 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి పూర్తిస్ధాయి సంస్కరణలోత ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యనభ్యసించే పేద విద్యార్ధులకు నాణ్యమైన విద్య అందుబాటులోకి రానున్నదన్నారు.
విద్యతోపాటు అనేక అభివృద్ధి పనులను కూటమి ప్రభుత్వం చేపట్టిందన్నారు. రానున్న సంక్రాంతి నాటికి గుంతలు లేని ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేందుకు రోడ్ల మరమ్మత్తు పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయన్నారు. అదే విధంగా అధికారంలోకి రాగానే పోలవరం ప్రాజెక్టును సందర్శించి నిర్వాసితులకు న్యాయంచేస్తామని చెప్పి నేడు ఆ మాటను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిలబెట్టుకున్నారన్నారు. ఈ మేరకు సంక్రాంతి కానుకగా 10 వేల మంది పోలవరం నిర్వాసితులకు పరిహారంగా ఒకేరోజు రూ. 815 కోట్లు చెల్లించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందన్నారు.