14 ఏళ్ల బాలిక కడుపులో కిలో జుట్టు.. తొలగించిన వైద్యులు

Doctors removed one-kilo hair from 14YO girl stomach in Guntur. కృష్ణా జిల్లా గుడివాడలోని శ్రీరాం నర్సింగ్‌హోమ్‌లో 14 బాలికకు శస్త్రచికిత్స చేసి కడుపులోంచి

By అంజి  Published on  1 Feb 2023 8:18 AM GMT
14 ఏళ్ల బాలిక కడుపులో కిలో జుట్టు.. తొలగించిన వైద్యులు

కృష్ణా జిల్లా గుడివాడలోని శ్రీరాం నర్సింగ్‌హోమ్‌లో 14 బాలికకు శస్త్రచికిత్స చేసి కడుపులోంచి కిలో వెంట్రుకలను వైద్యులు తొలగించారు. దీనికి సంబంధించిన వివరాల ఇలా ఉన్నాయి. పట్టణానికి చెందిన ఓ బాలిక గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండగా కడుపునొప్పి, వాంతులు, బరువు తగ్గడంతో కుటుంబ సభ్యులు ఆమెను గుడివాడలోని ఓ ప్రైవేట్ నర్సింగ్‌హోమ్‌కు తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు బాలికకు ఎండోస్కోపీ, స్కానింగ్ నిర్వహించగా కడుపులో నల్లటి గడ్డ ఉన్నట్లు గుర్తించి శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు.

మంగళవారం బాలికకు శస్త్ర చికిత్స చేసి కిలో గడ్డను తొలగించారు. వైద్యులు దానిని జుట్టు గడ్డగా గుర్తించారు. ట్రైకోబెజోర్స్ కారణంగా కొందరికి చిన్నప్పటి నుంచి వెంట్రుకలు తినే అలవాటు ఉంటుందని వైద్యులు తెలిపారు. అమ్మాయి వెంట్రుకలు ఎక్కువగా తింటోందని, అందుకే అవి కడుపులో పేరుకుపోయి జీర్ణవ్యవస్థలో పెద్ద గడ్డలా మారాయని చెప్పారు. 14 ఏళ్ల బాలిక గత పదేళ్లుగా వెంట్రుకలు తింటున్నట్లు వైద్యులు గుర్తించారు. బాలిక దాదాపు కిలో బరువున్న వెంట్రుకలను తినడంతో జీర్ణాశయం నిండిపోయిందని, తిన్న అన్నం బయటకు వచ్చిందని వారు తెలిపారు. మిగిలిన ఆహారం జీర్ణం కాకపోవడంతో బాలిక శక్తి కోల్పోయిందని వారు తెలిపారు. రక్తహీనత ఉన్నవారు కూడా ఇలాంటి ఆహారాన్ని తినడం అలవాటు చేసుకుంటారని వైద్యులు తెలిపారు.

"సాధారణంగా 20 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న కొంతమంది అమ్మాయిలు ముఖ్యంగా రక్తహీనతతో బాధపడుతున్నప్పుడు జుట్టును తినడం అలవాటు చేసుకుంటారు. ఇది వారి జుట్టు లేదా ఎక్కడైనా కనిపించే జుట్టును తినడం. అరుదైన పరిస్థితులలో జుట్టు కడుపులో హెయిర్‌ బాల్‌గా ఏర్పడుతుంది. ఇదే విధంగా ఉంటుంది. ట్రైకోబెజోర్‌ కారణంగా ఆమెకు పదేపదే వాంతులు అవుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఆమెకు తక్కువ ఆకలి, బరువు తగ్గడం మరియు కడుపునొప్పి ఉన్నాయి''అని డాక్టర్ పొట్లూరి వంశీ చెప్పారు.

Next Story