శాటిలైట్ ఫోన్ ను ఉపయోగిస్తున్న డాక్టర్ లోకేష్ బాబు
గన్నవరం విమానాశ్రయంలో ఉయ్యూరు లోకేష్ బాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 20 May 2024 3:30 PM ISTశాటిలైట్ ఫోన్ ను ఉపయోగిస్తున్న డాక్టర్ లోకేష్ బాబు
గన్నవరం విమానాశ్రయంలో ఉయ్యూరు లోకేష్ బాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటాయపాలెం గ్రామానికి చెందిన లోకేష్.. గతంలో అమెరికాలో డాక్టర్‌గా పనిచేసి రిటైరయ్యారు. ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతుగా పలు డిబేట్లలో పాల్గొన్నారు. ఈనెల 17వ తేదీ అర్థరాత్రి సిఎం జగన్ లండన్ వెళ్లేందుకు విమానాశ్రయానికి వస్తున్న సమయంలో అనుమానాస్పదంగా తిరగడంతో పోలీసులు తనిఖీ చేశారు. టికెట్ లేకపోవడం, సరైన సమాధానం చెప్పకపోవడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అనంతరం 41ఏ నోటీసు ఇచ్చి శనివారం ఆయనను పంపేశారు.
ఆదివారం మరోసారి ఢిల్లీ వెళ్లేందుకు ఆయన గన్నవరం విమానాశ్రయానికి వచ్చారు. విమానాశ్రయ అధికారుల తనిఖీల్లో లోకేష్ దగ్గర శాటిలైట్ ఫోన్ బయటపడింది. దీంతో అధికారులు గన్నవరం పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని విచారించారు. కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా శాటిలైట్ ఫోన్ వినియోగిస్తున్నట్లు గుర్తించారు. శాటిలైట్ ఫోన్ ఇక్కడ వినియోగించకూడదన్న విషయం తనకు తెలియదని లోకేష్ సమాధానం చెప్పినట్లు తెలిసింది. ఆ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆయన నుంచి అఫిడవిట్ తీసుకుని పంపేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శాటిలైట్ ఫోన్ వాడాలంటే తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి. డాక్యుమెంటేషన్ లేకుండా లోకేష్ వాడుతుండడంతో గన్నవరం పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. లోకేష్ గుంటూరు జిల్లా అమరావతి తుళ్లూరు మండలం వెంకటాయపాలెంకు చెందిన వ్యక్తి.అమెరికాకు వెళ్లి, US పౌరసత్వం పొందాడు. USAలోని రిచ్‌మండ్‌లో 38 సంవత్సరాలు గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌గా పనిచేశాడు. నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా అతని మెడికల్ లైసెన్స్‌ను స్థానిక అధికారులు రద్దు చేసినట్లు సమాచారం. ఇటీవల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చేందుకు డా.లోకేశ్ ఆంధ్రప్రదేశ్‌కు వచ్చారు.