ఏపీలో నేడు, రేపు తీవ్ర వడగాలులు..రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్‌లో నేడు 17 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.
By Knakam Karthik
ఏపీలో నేడు, రేపు తీవ్ర వడగాలులు..రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్‌లో నేడు 17 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. పార్వతీపురం మన్యం జిల్లాలో 2, ఏలూరు-1, కృష్ణా-6, గుంటూరు-2, పల్నాడు జిల్లాలోని 2 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. శుక్రవారం కూడా 7 మండలాల్లో తీవ్ర వడగాలుల వీచే అవకాశం ఉందని తెలిపింది. బుధవారం కర్నూలు జిల్లా ఉలిందకొండలో 40 డిగ్రీలు, ప్రకాశం జిల్లా దరిమడుగలో 40, చిత్తూరు జిల్లా తవణంపల్లెలో 40, వైఎస్‌ఆర్ జిల్లా జమ్మలమడుగులో 39, అల్లూరి జిల్లా ఎర్రంపేట, నంద్యాల జిల్లా దొర్నిపాడు, పల్నాడు జిల్లా అమరావతిలో 39.7 డిగ్రీల చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లు తెలిపింది.
ఐఎండీ సూచనల ప్రకారం బంగాళాఖాతంలోని అల్పపీడనం, ఉత్తర-ఈశాన్య దిశగా తిరిగి వచ్చి 24 గంటల్లో మధ్య బంగాళాఖాతంలో క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని తెలిపింది. వాయువ్య ఆంధ్రప్రదేశ్, దాని పరిసర ప్రాంతాల్లో విస్తరించిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో గురువారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరిసీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ప్రకాశం,నెల్లూరు, శ్రీ సత్య సాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది.