ఆ ముగ్గురి మీద కంప్లైంట్ ఇచ్చాను : రామ్‌గోపాల్ వర్మ
ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తీసిన కొత్త సినిమా వ్యూహం పలు కారణాల వలన వార్తల్లో నిలిచింది.
By Medi Samrat Published on 27 Dec 2023 7:23 PM ISTప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తీసిన కొత్త సినిమా వ్యూహం పలు కారణాల వలన వార్తల్లో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా డిసెంబర్ 29న విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించి పలు టీవీ ఛానల్స్ లో కూడా చర్చ జరిగింది. ఏపీకి చెందిన కొలికపూడి శ్రీనివాసరావు ఆర్జీవీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రామ్‌గోపాల్ వర్మ తల నరికి తెచ్చినవారికి కోటి రూపాయలు బహుమానంగా ఇస్తానని ప్రకటించాడు. ఆర్జీవీ- పరాన్నజీవి పేరుతో ఓ ఛానల్‌లో నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా ఆర్జీవీ స్పందిస్తూ.. 'కొలికపూడి నన్ను చంపించేందుకు కాంట్రాక్ట్ ఇచ్చాడు. యాంకర్ సాంబశివరావు అతడికి తెలివిగా సాయం చేశాడు. తన హత్యకు సంబంధించి కొలికపూడి చేసిన వ్యాఖ్యలను 3 సార్లు పునరావృతం చేసేలా వ్యవహరించాడు' అని ట్వీట్ చేశారు. బుధవారం నాడు విజయవాడ పోలీసులను కలవనున్నట్లు తెలిపారు వర్మ. కొలికపూడి శ్రీనివాసరావుతో పాటు యాంకర్ సాంబశివరావు, సదరు ఛానెల్ యజమాని బిఆర్ నాయుడు పై ఫిర్యాదు చేయనున్నట్లు వర్మ తెలిపారు. కొలికపూడి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేసే సమయంలో యాంకర్ సాంబశివరావు మీరు ఈ వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలి అంటూ చెప్పడం ఆ వైరల్ వీడియోలో చూడొచ్చు.
ట్వీట్‌లో వెల్లడించినట్లుగానే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, నిర్మాత దాసరి కిరణ్ కుమార్ డీజీపీ కార్యాలయానికి చేరుకున్నారు. కొలికిపూడి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలపై డీజీపీకి ఫిర్యాదు చేశారు. అనంతరం రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ.. నన్ను చంపడానికి నిన్న రాత్రి టీవీ-5 డిబేట్‌లో కొలికిపుడి శ్రీనివాస్ ఒక సుపారి (కాంట్రాక్ట్) ఆఫర్ ఇచ్చారు. ఆ డిబేట్ ని కొనసాగించింది అంటే అది యాజమాన్యం తప్పు కూడా అన్నారు. ఆ మాటలు తప్పు అని కూడా ఎవరు ఖండించలేదన్నారు. ఎప్పుడు నన్ను చంపడానికి ఎవరూ సుపారీ ఇవ్వలేదు. అందుకే ఇప్పటివరకూ నేను కంప్లైంట్ కూడా చెయ్యలేదని వివరించారు.
వ్యూహం అనే సినిమా నా పొలిటికల్ కాన్సెప్ట్ అని తెలిపారు. మీరేమి తప్పు చెయ్యనప్పుడు భయపడటం ఎందుకు అని ప్రశ్నించారు. గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే ఎందుకు వీళ్లంతా భుజాలు తడుముకుంటుంన్నారని ప్రశ్నించారు. తాను కొలికిపుడి శ్రీనివాస్ రావు, యాంకర్ సాంబశివ రావు, టీవీ 5 ఛానెల్ ఎండి బీఆర్ నాయుడు మీద కంప్లైంట్ ఇచ్చానని వెల్లడించారు. ప్రోసీజర్ ప్రకారం చర్యలు తీసుకుంటామని డీజీపీ చెప్పారని రాంగోపాల్ వర్మ తెలిపారు.