ఉక్కబోత తప్పదా?
Different arguments on the electricity issue in AP. రాష్ట్రంలో కరెంట్ కష్టాలు తప్పవా? పాత బకాయిలు చెల్లించకపోవడంతో సరఫరా నిలిచిపోతుందా? గత
By సునీల్ Published on 19 Aug 2022 2:33 PM IST* విద్యుత్‌పై భిన్న వాదనలు
* బకాయిలపై ఇటీవల కేంద్రం హెచ్చరికలు
* వేసవికి ఇబ్బందులేం ఉండవంటున్న ప్రభుత్వం
రాష్ట్రంలో కరెంట్ కష్టాలు తప్పవా? పాత బకాయిలు చెల్లించకపోవడంతో సరఫరా నిలిచిపోతుందా? గత ప్రభుత్వ తప్పిదాలే సమస్యలకు కారణమా? రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తోందా? ప్రస్తుతం ఏపీలో విద్యుత్ వ్యవహారంపై మెదులుతున్న ప్రశ్నలివి.
కొనుగోలు, అమ్మకాలపై నిషేధం
ఏపీ సహా 13 రాష్ట్రాలు విద్యుదుత్పత్తి సంస్థలకు భారీగా బకాయి పడ్డాయి. అవి చెల్లించకపోతే విద్యుత్ సంక్షోభం తప్పదని ఇటీవల కేంద్రం హెచ్చరించింది. పవర్ సిస్టమ్ ఆపరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్(POSOCO) 27 పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీల పవర్ ట్రేడింగ్‌ను నిషేధించాలని ఇండియన్ ఎనర్జీ ఎక్స్ఛేంజ్, పవర్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా, హిందూస్తాన్ పవర్ ఎక్స్ఛేంజ్‌లను కోరింది. ఈ నెల 19 నుంచి అమ్మకాలు, కొనుగోలు నిషేధించాలని సూచించింది.
అర్జెంటుగా కట్టాల్సిన బకాయిలు
విద్యుత్ బకాయిల్లో కొంత మొత్తాన్ని వెనువెంటనే కట్టాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ రూ. 412 కోట్లు, మహారాష్ట్ర రూ. 381 కోట్లు, చత్తీస్ గఢ్ రూ. 274కోట్లు, తెలంగాణ రూ. 1380 కోట్లు, తమిళనాడు రూ. 924 కోట్లు చొప్పున ఉన్నాయి. ఈ మొత్తాలను చెల్లిస్తేనే తదుపరి లావాదేవీలు కొనసాగుతాయి. ఈ బకాయిలు చెల్లిస్తేనే రోజువారీ అవసరాల కోసం బహిరంగ మార్కెట్లో కరెంట్ కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.
కరెంట్ కష్టాలు ఉండవు..
ఏపీలో కరెంటు కష్టాలు ఉండవని ప్రభుత్వం చెబుతోంది. రాబోయే 6 నెలల్లో 1,600 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుందని ఇంధన శాఖ స్పెషల్ సీఎస్ విజయానంద్ చెబుతున్నారు. వర్షాకాలం వచ్చినా డిమాండ్ తగ్గనందునే కొరత ఏర్పడుతోందన్నారు. డిమాండ్ కన్నా సప్లై తక్కువ ఉండటం వల్లే లోటు ఉందన్నారు. వేసవికి ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. కృష్ణపట్నం, ఎన్టీపీసీల నుంచి 800 మెగావాట్ల చొప్పున అందుబాటులోకి వస్తుందన్నారు.
డబ్బులు కట్టాం. అప్డేట్ కాలేదు..
విద్యుత్ కొనుగోళ్లపై కేంద్రం నిషేధం విధించగానే స్పందించామని విద్యుత్ అధికారులు అంటున్నారు. తొలి వాయిదా కింద ఆగస్టు ఐదునే రూ 1422 కోట్లు చెల్లించామని చెబుతున్నారు. చెల్లింపులు అప్డేట్ కాకపోవడం వల్లే కేంద్రం నోటిసులిచ్చిందన్నారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రుణం తీసుకుంటున్నామని, భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా చెల్లింపులు జరుపుతున్నామంటున్నారు.
కరెంట్ రాజకీయం..
ఏపీలో ఏ అంశమైనా రాజకీయ యుద్ధానికి దారి తీస్తుంది. తాజా కరెంట్ బకాయిలపైనా అధికార, ప్రతిపక్షాలు విమర్శలకు దిగుతున్నాయి. గత టీడీపీ ప్రభుత్వం విధానాల వల్లే బకాయిలు పేరుకుపోయాయని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ట్రూ అప్ వసూళ్లు చేయకపోవడంతో బకాయిలు ఉండిపోయాయని, ఆ పాపం గత ప్రభుత్వానిదేనని చెబుతున్నాయి. తమ హయాంలో ఎప్పుడూ చార్జీలు పెంచలేదని టీడీపీ కౌంటర్లిస్తోంది. విభజనతో ఏర్పడిన కరెంట్ లోటును పూడ్చింది తామేననంటున్నారు. ఎక్కడి కోతలు లేకుండా చూస్తే.. వైసీపీ ప్రభుత్వం చీకటి రాష్ట్రంగా మారుస్తోందని విమర్శలు గుప్పిస్తోంది.