అన్నా చెల్లెళ్ల మధ్య ఆస్తి వివాదాలు.. కోర్టుకెక్కిన వైఎస్‌ జగన్‌

వైఎస్ జగన్ తన సోదరి వైఎస్ షర్మిల, తల్లి విజయ్మకు ఆస్తి పంపకాల విషయంలో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ లో ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టించింది.

By అంజి  Published on  24 Oct 2024 7:56 AM IST
YCP, YS Jagan, YS Sharmila, assets, APnews

అన్నా చెల్లెళ్ల మధ్య ఆస్తి వివాదాలు.. కోర్టుకెక్కిన వైఎస్‌ జగన్‌

వైఎస్ జగన్ తన సోదరి వైఎస్ షర్మిల, తల్లి విజయ్మకు ఆస్తి పంపకాల విషయంలో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ లో ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టించింది. సరస్వతి పవర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ ప్రైవేటు లిమిటెడ్‌ షేర్ల వివాదంపై క్లాసిక్‌ రియాల్టీ ప్రైవేటు లిమిటెడ్‌, వైఎస్‌ జగన్‌, వైఎస్‌ భారతి రెడ్డి పేర్లతో ఐదు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లో వైఎస్‌ షర్మిల, వైఎస్‌ విజయమ్మతో పాటు సరస్వతి పవర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ ప్రైవేటు లిమిటెడ్‌, చాగరి జనార్దన్‌ రెడ్డి, కేతిరెడ్డి యశ్వంత్‌ రెడ్డి, రీజినల్‌ డైరెక్టర్ సౌత్‌ ఈస్ట్‌ రీజియన్‌, రిజిస్ట్రార్‌ ఆప్‌ కంపెనీస్‌ తెలంగాణలను ప్రతివాదులుగా చేరుస్తూ పిటిషన్‌ వేశారు.

తాము కంపెనీ అభివృద్ధి కోసం కృషి చేశామని తెలిపారు. 2019 ఆగస్టు 21న ఎంవోయూ ప్రకారం విజయమ్మ, షర్మిలకు షేర్లు కేటాయించామని పేర్కొన్నారు. కానీ వివిధ కారణాలతో కేటాయింపు జరగలేదని చెప్పారు. ప్రస్తుతం ఆ షేర్లను విత్‌ డ్రా చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నామని పిటిషన్‌లో ప్రస్తావించారు. ఈ పిటిషన్లపై తాజాగా విచారణ చేపట్టిన ఎన్‌సీఎల్‌టీ.. ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నవంబర్‌ 8వ తేదీకి వాయిదా వేసింది.

దీనికి కౌంటర్ గా వైఎస్ షర్మిల కూడా ఓ లేఖను విడుదల చేశారు. తండ్రి వైఎస్‌ఆర్‌ సంపాదించిన ఆస్తుల్లో తనకు, తన పిల్లలకు దక్కాల్సిన వాటా ఇవ్వకుండా.. సోదరుడు వైఎస్‌ జగన్‌ తనకు అన్యాయం చేశారని వైఎస్‌ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆస్తుల పంపకంపై జగన్‌ లేఖకు షర్మిల ఘాటు రిప్లై ఇచ్చారు.

''నాన్న సంపాదించిన ఆస్తిని చెరిసగం పంచుకోవాలని సూచించారు. నాన్న చెప్పిన మాటకు అప్పుడు నువ్వు కూడా అంగీకరించావు. కానీ నాన్న మరణం తర్వాత మాట తప్పావు. భారతి సిమెంట్స్, సాక్షిలో మెజార్టీ వాటాను దక్కించుకునేందుకు నాపై ఒత్తిడి చేశావు. బుల్లోజ్ చేసి బలవంతంగా ఒప్పందం చేసుకున్నావు. అన్న అనే గౌరవం, కుటుంబం పరువు కోసం మేజర్ షేర్ వదులుకున్నా. 31-8-2019న జరిగిన ఒప్పందాన్ని కూడా ఉల్లంఘించావు. కేవలం కొన్ని ఆస్తులు మాత్రమే నాకు ఇచ్చారు. ఇప్పుడు కన్న తల్లి, తోబుట్టువుపైనే కేసులు పెట్టావు. నాన్న మాటతోపాటు ఒప్పందాన్నీ ఉల్లంఘించావు. నువ్వు పంపిన లేఖ ఒప్పందం, వాస్తవానికి విరుద్ధం. అమ్మపై, నాపై కేసు వేస్తావని నాన్న కలలో కూడా ఊహించివుండరు. పేరు బదలాయించకుండా ఏళ్ల తరబడి కాలయాపన చేశావు. భారతి, సండూర్ పవర్‌లో అమ్మ వాటాను గిఫ్ట్ డీడ్‌గా ఇచ్చేందుకు నువ్వు, భారతి సంతకాలు చేశారు. వాటాలు ఇవ్వకుండా అనవసరంగా కోర్టుకెక్కావు. సరస్వతి పవర్ వాటాల విషయంలో అమ్మకు పూర్తి అధికారం ఇచ్చావు. అన్నింటికి ఒప్పుకుని ఇప్పుడు వివాదం కోర్టుకు తీసుకెళ్లావు. సరస్వతి పవర్‌లో న్యాయబద్ధంగా నాకే వాటా ఉంది. నా రాజకీయ జీవితం నా ఛాయిస్.. నన్ను డిక్టేట్ చేయలేవు'' అని వైఎస్‌ షర్మిల.. వైఎస్‌ జగన్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.

అంతకుముందు వైఎస్‌ షర్మిలకు జగన్‌ లేఖ రాశారు. లేఖలో.. ''నన్ను రాజకీయంగా వ్యతిరేకించి, నా వ్యక్తిగత ప్రతిష్ఠ దెబ్బతీసేలా వ్యవహరించావు. బహిరంగంగా తప్పుడు వ్యాఖ్యలు చేశావు. అసత్యాలు చెప్పావు. నాకు వ్యతిరేకంగా ఇలాంటి అనేక కార్యకలాపాలకు పాల్పడ్డావు. నీ చర్యలు తీవ్రంగా బాధిచాయి. అందుకే సరస్వతి పవర్‌ కంపెనీలో గిఫ్ట్‌ డీడ్‌ కింద నీకు రాసిచ్చిన వాటలను వెనక్కి తీసుకుంటున్నా'' అని వైఎస్‌ జగన్‌ లేఖలో పేర్కొన్నారు. మన ఇద్దరి మధ్య సత్సంబంధాలు లేవని, అందుకే గతంలో నీకు ఇస్తున్న వాటాలను రద్దు చేసుకుంటున్నానని లేఖలో పేర్కొన్నారు. ఆగస్టు 27న రాసిన ఈ లేఖను ఆయన తాజాగా ఎన్‌సీఎల్‌టీలో దాఖలు చేసిన పిటిషన్‌కు అనుబంధంగా జతపర్చారు.

Next Story