ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి కట్టడి కోసం విధించిన కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తే.. వాహనాలను జప్తు చేస్తామని డీజీపీ గౌతమ్ సవాంగ్ హెచ్చరించారు. విజయవాడలో పలు చోట్ల కర్ఫ్యూ అమలు తీరును పరిశీలించిన అనంతరం మాట్లాడారు. అందరూ మాస్కులు ధరించాలని, శానిటైజర్ ఉపయోగించాలని సూచించారు. అంతర్ రాష్ట్ర రాకపోకలకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. అప్పటి వరకు షరతులు కొనసాగుతాయన్నారు.
ఇక అత్యవసర ప్రయాణీకుల కోసం రేపటినుంచి(మే 10 సోమవారం) నుంచి ఈ పాస్ విధానం అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం ఈ-పాస్ పోలీస్ సేవ అప్లికేషన్‌ను వినియోగించుకోవాలని సూచించారు. ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు రాష్ట్రంలో 144 సెక్షన్ ఉంటుందని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీ సభలు, సమావేశాలకు అనుమతి లేదని.. శుభకార్యాలకు అధికారుల వద్ద అనుమతి తప్పనిసరి తీసుకోవాలన్నారు. కరోనా నిబంధనలను అందరూ పాటించాలని.. కర్ఫ్యూ నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా ఉల్లంఘనలకు పాల్పడితే.. డయల్ 100, 112 నంబర్లకు సమాచారం అందించాలని డీజీపీ అన్నారు.
ఏపీలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో గత కొద్ది రోజులు పాజిటివ్ కేసుల సంఖ్య అమాంతం పెరుగుతున్నాయి. దీంతో ఈ మహమ్మారి కట్టడి చేసేందుకు ప్రభుత్వం పగటి పూట కర్ఫ్యూని విధించిన విషయం తెలిసిందే. ప్రతి రోజూ మధ్యాహ్నాం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయి. ఈ నెల 18 వరకు కర్ఫ్యూ అమల్లో ఉండనుంది.