విజయవాడ తూర్పు నియోజకవర్గం తారకరామా నగర్‌లో వైఎస్సార్‌సీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలపై వైఎస్సార్‌సీపీ యువనేత దేవినేని అవినాష్ స్పందిస్తూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టీడీపీ నేతలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడి చేయడంతో ఆగ్రహించిన అవినాష్ స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనకు సీటు ఖరారు చేసిన తర్వాతే టీడీపీ కుట్రలు చేస్తోందన్నారు. ఓటమి భయం పట్టుకుందని, అందుకే టీడీపీ నీచ రాజకీయాలకు పాల్పడుతోందన్నారు.
టీడీపీ నేత గద్దె రామ్మోహన్‌పై విమర్శలు గుప్పించిన దేవినేని అవినాష్.. తాను పెద్దమనిషినని చెప్పుకునే వాడు నీచ రాజకీయాలు చేస్తున్నాడని, ఎన్ని కుట్రలు చేసినా రాబోయే ఎన్నికల్లో టీడీపీకి ఓటమి తప్పదని వ్యాఖ్యానించారు. దేవినేని అవినాష్ చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలతో టీడీపీ నేతలు వాగ్వాదానికి దిగిన సంగతి తెలిసిందే. విజయవాడలోని రాణి తారకరామా నగర్‌లో పింఛన్ రావడం లేదని మహిళలు వాపోయారు.
"పని చేసిన వాళ్ల జెండాలను మా ఇళ్లపై పెట్టుకుంటాం అందుకే తెలుగుదేశం జెండాను మా ఇళ్లపై పెట్టుకున్నాం. మీకోసం పనిచేశాం మీరు మాకు ఏం చేశారు. మమ్మల్ని మోసం చేశారంటూ" అవినాష్‌ను పలువురు మహిళలు ప్రశ్నించారు. ఈ సంఘటనతో దేవినేని అవినాష్ మౌనంగా ఉండిపోయారు. చివరకు వైసీపీ నేతలు మహిళలకు సర్ది చెప్పి ఏ సమస్య ఉన్న ఇకపై పరిష్కరిస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్లి పోయారు. అయితే, తనపై టీడీపీ కుట్ర పన్నిందని అవినాష్ మండిపడ్డారు.