అమరావతి: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం పెరవలిలో పర్యటించనున్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం రూ.3050 కోట్లతో చేపట్టిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ కు రేపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా అధునాతన సాంకేతికతతో సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ వద్ద ధవళేశ్వరం, బొబ్బర్లంక, వేమగిరి సమీపంలో నుండి గోదావరి జలాలు శుద్ధి చేసి తూర్పు, పశ్చిమ గోదావరి, కాకినాడ, ఏలూరు, డా.బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ తదితర 5 జిల్లాల్లోని 23 నియోజకవర్గాలు, 66 మండలాల్లోని 67.82 లక్షల మంది ప్రజలకు లబ్ధి చేకూరనుంది.
అందులో భాగంగా రూ.1,650 కోట్లతో ఉమ్మడి తూర్పుగోదావరిలోని కాకినాడ, డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ, ఈస్ట్ గోదావరిలోని 11 నియోజకవర్గాలు, 32 మండలలాల్లోని 39.64 లక్షల మంది ప్రజలకు, రూ.1,400 కోట్లతో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని 12 నియోజకవర్గాలు, 34 మండలాల్లోని 28.18 లక్షల ప్రజలకు త్రాగునీరు సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. జల్ జీన్ మిషన్ నిధులతో రెండు దశల్లో నిర్మాణ పనుల పూర్తికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధమైంది. ఈ నేపథ్యంలో 2 ఏళ్లలో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పనుల పూర్తికి కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది.