వైసీపీ తమకు శత్రువు కాదని, ప్రత్యర్థి మాత్రమేనని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఈ విషయాన్ని జనసేన నేతలు అర్థం చేసుకోవాలని కోరారు. వైసీపీ నేతలను కక్షపూరితంగా వేధించొద్దన్నారు. సోషల్ మీడియాలో నిందించకూడదని, వ్యక్తిగత దూషణలు చేయకూడదన్నారు. వాళ్లు చేసిన తప్పులు మనం చేయకూడదని, అలా అని మనం చేతులు కట్టుకుని ఉండొద్దన్నారు. వాళ్లు తప్పులు చేసి ఉంటే చట్టప్రకారం శిక్ష పడుతుందని పేర్కొన్నారు. పోటీ చేసిన ప్రతి స్థానంలోనూ గెలిచామని, ఇది దేశంలోనే ఒక కేస్ స్టడీ అని పవన్ అన్నారు.
అనంత్ అంబానీ పెళ్లికి వెళితే అందరూ దీని గురించే మాట్లాడారని తెలిపారు. కూటమి విజయానికి జనసేన ప్రజాప్రతినిధుల సత్కార కార్యక్రమంలో పవన్ మాట్లాడారు. తాను డిప్యూటీ సీఎం అవుతానని అనుకోలేదని చెప్పారు. ప్రధాని మోదీ మనసులో తనకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. తాను ప్రధాని మోదీని ఇప్పటి వరకూ ఏం అడగలేదన్నారు. ఇప్పుడు రాష్ట్రం కోసం అడుగుతానని చెప్పారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దని చెబుతానన్నారు. రైల్వే జోన్ ఏర్పాటు గురించి, 25 లక్షల ఉద్యోగాలు కావాలని అడుగుతానని పవన్ తెలిపారు.