తప్పులు జరిగితే హిందువులు మాట్లాడాలి: డిప్యూటీ సీఎం పవన్
తిరుమల లడ్డూలో ఉపయోగించే నెయ్యిలో పెద్ద ఎత్తున కల్తీ జరిగిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు.
By అంజి Published on 22 Sept 2024 12:00 PM ISTతప్పులు జరిగితే హిందువులు మాట్లాడాలి: డిప్యూటీ సీఎం పవన్
తిరుమల లడ్డూలో ఉపయోగించే నెయ్యిలో పెద్ద ఎత్తున కల్తీ జరిగిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. నెయ్యిలో ప్యూర్ మిల్క్ ఫ్యాట్ ఎస్ - వ్యాల్యూ 98.62 నుంచి 104.32 ఉండాలి. కానీ 20 మాత్రమే ఉందని ఎన్‌డీడీబీ రిపోర్ట్ తెలిపిందన్నారు. నెయ్యిలో వెజిటబుల్ ప్లాంట్ బేస్డ్ కల్తీ జరుగుతుంది కానీ ఫిష్ ఆయిల్, పంది కొవ్వు, ఆవు కొవ్వు ఉన్నట్లు తేలిందన్నారు. అయోధ్య కోసం కూడా లక్ష లడ్డూలు పంపారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమలలో జరిగినట్టు చర్చి, మసీదులో ఏదైనా అపవిత్రత చోటు చేసుకుంటే దేశమంతా అల్లకల్లోలం చేసేవారని, ప్రపంచమంతా తెలిసేదని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు.
తాము అన్ని మతాలను గౌరవిస్తామని, కానీ ఈ వివాదంపై మాట్లాడొద్దంటే ఎలా? అని ప్రశ్నించారు. దీని వల్ల కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని, ఇదే చర్చి, మసీదులో జరిగితే మాజీ సీఎం జగన్ ఊరుకుంటారా? దోషులను ఎందుకు వెనకేసుకొస్తున్నారు? అని పవన్ ఫైరయ్యారు. తిరుమలోలాగా ఎక్కడ ఏ తప్పు జరిగినా హిందువులంతా బయటకు వచ్చి మాట్లాడాలని డిప్యూటీ సీఎం పవన్ పిలుపునిచ్చారు. మనకెందుకులే అని ఊరుకుంటే ఇలాంటివే జరుగుతాయని అన్నారు. స్వామికి అపవిత్రం జరుగుతుంటే తిరుమలలో పని చేసే సిబ్బంది ఎందుకు కామ్‌గా ఉన్నారు అని ప్రశ్నించారు. వైసీపీకి భయపడ్డారా? అని నిలదీశారు.
ప్రతీ హిందువు మతాన్ని గౌరవించాలని పవన్ వ్యాఖ్యానించారు. ఈ నెయ్యితో చేసిన లడ్డూలను అయోధ్యకు పంపడం దారుణమని అన్నారు. తిరుమలలో జరిగిన ఘటన భవిష్యత్తులో మళ్లీ జరగకుండా ఎన్డీఏ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని డిప్యూటీ సీఎం పవన్ హామీ ఇచ్చారు. దీనిపై సీబీఐతో విచారణ జరిపించడంపై కేబినెట్‌లో చర్చిస్తామన్నారు. దీనిపై నిర్ణయం తీసుకోవాలని సీఎం చంద్రబాబును కోరుతున్నానని, ఆయన ఏ నిర్ణయం తీసుకున్న తమ మద్ధతు ఉంటుందన్నారు. వైసీపీ హయాంలో టీడీపీలో జరిగిన అక్రమాలు, అపచారాలపై విచారణ జరగాలని, దోషులను శిక్షించాలని పవన్ అన్నారు.