సొంత నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాలకు పవన్ శ్రీకారం..మూడ్రోజులు అక్కడే
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మూడు రోజులపాటు తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటించనున్నారు
By - Knakam Karthik |
సొంత నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాలకు పవన్ శ్రీకారం..మూడ్రోజులు అక్కడే
అమరావతి: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మూడు రోజులపాటు తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటించనున్నారు. గురువారం రాత్రికి పిఠాపురం చేరుకోనున్న ఆయన శుక్రవారం ఉదయం పీఠికాపుర సంక్రాంతి మహోత్సవం పేరిట నిర్వహించనున్న ముందస్తు సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటారు. ఉదయం 10.30 గంటలకు ఆర్.ఆర్.బి.హెచ్.ఆర్. కళాశాల మైదానానికి చేరుకుని సంక్రాంతి సంబరాలను ప్రారంభిస్తారు. ఉదయం 11.30 గంటలకు నియోజకవర్గ పరిధిలో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు.
అనంతరం సంక్రాంతి మహోత్సవంలో పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలు, స్టాళ్లను తిలకిస్తారు. సాయంత్రం పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలో ఇటీవల ముంపునకు గురైన ఇందిరానగర్ కాలనీ, రైల్వే స్టేషన్ సమీపంలోని మోహన్ నగర్ లను సందర్శిస్తారు. శనివారం ఉదయం గొల్లప్రోలు ప్రాంతంలోని ఇళ్ళ స్థలాలను పరిశీలిస్తారు. అక్కడి నుంచి ఉదయం గం. 10. 30 నిమిషాలకు కాకినాడలోని జిల్లా పోలీస్ కార్యాలయానికి చేరుకుని శాంతి భద్రతలపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3 గం.కి కాకినాడలోని రంగరాయ మెడికల్ కళాశాలకు చేరుకుని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు.
పిఠాపురం వేదికగా మూడు రోజులపాటు నిర్వహించనున్న సంక్రాంతి సంబరాలు ఆద్యంతం తెలుగుదనం ఉట్టిపడేలా సాంస్కృతిక కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. మొదటి రోజు సంక్రాంతి పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, జానపదగీతాలాపనలు, వీర నాట్యాలు, ఉరుముల నృత్యాలు, తప్పెట గుళ్లు, గరగు నృత్యాలు, లంబాడ నృత్యం, డప్పులు, గిరిజన సంప్రదాయ నృత్యరీతి అయిన థింసా, అలాగే కూచిపూడి, భరతనాట్యం తదితర శాస్త్రీయ నాట్య ప్రదర్శనలు, కోలాటాలు ఏర్పాటు చేశారు. రెండో రోజు జనవరి 10 తేదీన మొదటి రోజు ప్రదర్శనలతోపాటు కేరళ సంప్రదాయ మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శనలు ఉంటాయి. చివరి రోజు గ్రామీణ జానపదుల పాటలు, సినీ మ్యూజికల్ నైట్ కార్యక్రమాలు ఆహుతులను అలరించనున్నాయి.