ఉచిత గ్యాస్ సిలిండర్.. రేపటి వరకే అవకాశం
దీపం-2 పథకం కింద 2వ విడతలో ఉచిత గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే అవకాశం జులై 31తో ముగియనుంది.
By అంజి
ఉచిత గ్యాస్ సిలిండర్.. రేపటి వరకే అవకాశం
అమరావతి: దీపం-2 పథకం కింద 2వ విడతలో ఉచిత గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే అవకాశం జులై 31తో ముగియనుంది. గడువు దాటిన తర్వాత బుక్ చేసుకోవడం కుదరదు. 3వ విడత ఉచిత సిలిండర్‌ను ఆగస్టు 1 నుంచి నవంబర్ 30వ తేదీ లోపు బుక్ చేసుకోవాలి. గ్యాస్ బుక్ చేసుకున్న 48 గంటల్లోగా లబ్ధిదారులకు ప్రభుత్వం రాయితీ డబ్బును జమ చేస్తోంది. అటు బ్యాంక్ వివరాలు సరిగ్గా లేకపోవడంతో 86,000 మందికి రాయితీ డబ్బులు జమ కాలేదని ప్రభుత్వం గుర్తించింది.
గతేడాది నవంబరులో ప్రారంభించిన దీపం-2 పథకం కింద లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఉచిత గ్యాస్ సిలిండర్ల రాయితీ సొమ్మును ఇక నుంచి ముందుగానే లబ్ధిదారుల బ్యాంకు అకౌంట్లలో జమచేసే ప్రక్రియను ప్రారంభించేందుకు ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు అమలు చేసినట్లు మంత్రి తెలిపారు. ఈ జిల్లాల్లో 4,281 మంది లబ్ధిదారులను గుర్తించి, వారి స్మార్ట్ ఫోన్ నుంచే గ్యాస్ ఏజెన్సీలకు చెల్లింపు జరిగే విధంగా పంజాబ్ నేషనల్ బ్యాంకు డిజిటల్ వాలెట్ విధానాన్ని అమలు చేసినట్లు వివరించారు.