ఏపీలో విషాదం..అందుబాటులో లేని అంబులెన్స్, బైక్‌పై మృతదేహంతో 10 కిలోమీటర్లు జర్నీ

ఆంధ్రప్రదేశ్‌లో మానవత్వం మంటగలిసిన ఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది.

By -  Knakam Karthik
Published on : 10 Feb 2026 4:19 PM IST

Andrapradesh, Bapatla District, Chintayapalem village, Nageswara Rao, Heartattack, Bapatla Area Hospital

ఏపీలో విషాదం..అందుబాటులో లేని అంబులెన్స్, బైక్‌పై మృతదేహంతో 10 కిలోమీటర్లు జర్నీ

ఆంధ్రప్రదేశ్‌లో మానవత్వం మంటగలిసిన ఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది. పేదరికం ఒకవైపు, ప్రభుత్వ వ్యవస్థల నిర్లక్ష్యం మరోవైపు ఆ కుటుంబాన్ని వేధించాయి. గుండెపోటుతో మరణించిన తండ్రి మృతదేహాన్ని తరలించేందుకు అంబులెన్స్ లేక, ఆటోకు అడిగినంత డబ్బు ఇచ్చుకోలేక.. ఆ కుమారుడు మృతదేహాన్ని బైక్‌పైనే తరలించిన తీరు ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తోంది.

వివరాల్లోకి వెళ్తే.. బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం చింతాయపాలెం గ్రామానికి చెందిన నాగేశ్వరరావు అనే వ్యక్తికి ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను చికిత్స నిమిత్తం బాపట్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వ అంబులెన్స్ కోసం ప్రయత్నించగా, అక్కడ ఏ వాహనమూ అందుబాటులో లేదు. ప్రైవేట్ ఆటోను ఆశ్రయించగా, ఆసుపత్రి నుంచి గ్రామానికి వెళ్లడానికి రూ. 2,000 డిమాండ్ చేశారు. అంత సొమ్ము ఇచ్చుకునే స్తోమత లేని ఆ కుటుంబం తీవ్ర మనోవేదనకు గురైంది. చేసేదేమీ లేక, మృతదేహాన్ని బైక్‌పై మధ్యలో కూర్చోబెట్టుకుని, పడిపోకుండా కట్టుకుని సుమారు 10 కిలోమీటర్లు ప్రయాణించి స్వగ్రామానికి చేరుకున్నారు. నడిరోడ్డుపై బైక్‌పై మృతదేహాన్ని తీసుకెళ్తున్న దృశ్యాలను చూసిన స్థానికులు విస్తుపోయారు.

Next Story