నెల్లూరు జిల్లా కొత్తూరులో దారుణం వెలుగుచూసింది. పెద్ద కూతురు వైద్యం కోసం చిన్న కూతురును అమ్మకానికి పెట్టిన హృదయవిదారక ఘటన ఆలస్యంగా వెలుగులోకి వ‌చ్చింది. రోజు కూలీలుగా పనిచేస్తూ పూట గ‌డుపుతున్న ఆ కుటుంబంలో పెద్ద కూతురు (16)కు అరుదైన వ్యాధి సోకింది. దీంతో వైద్యానికి డబ్బు కోసం ఆ దంప‌తులు చిన్న కూతురు (12)ను రూ.10 వేలకు అమ్మారు.

బాలికపై కన్నేసిన స్థానికుడైన చిన్న సుబ్బయ్య (46) పేద దంపతుల అవసరాన్ని ఆసరా చేసుకొని రూ.10 వేలకు అమ్మాయిని ఇటీవ‌ల‌ కొనుగోలు చేశాడు. గురువారం బాలికను పెళ్లి చేసుకొని డాంపూర్‌లోని తన బంధువుల ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ బాలికను చిత్రహింసలకు గురిచేయడంతో అమ్మాయి ఏడుపు విన్న స్థానికులు సర్పంచ్‌కు, ఐసీడీఎస్‌ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదుచేశారు.

పోలీసులు చిన్న సుబ్బయ్యను అరెస్టుచేశారు. పోలీసులు మాట్లాడుతూ.. నిందితుడి గురించి తెలిసిన భార్య అతడిని వదిలేసిందని తెలిపారు. బాలికను కౌన్సెలింగ్‌ సెంటర్‌కు తరలించామ‌ని పేర్కొన్నారు. గతంలో కూడా సుబ్బయ్య పలు కుటుంబాలకు డబ్బు ఎరచూపి ఇలా అమ్మాయిలను పెళ్లీల్లు చేసుకున్నాడ‌ని తెలుస్తోంది.


సామ్రాట్

Next Story