ఏపీ ప్రభుత్వానికి ఎన్‌జీటీ షాక్.. రూ.5 కోట్ల జరిమానా
Damage to mangroves AP govt fined Rs 5 Cr NGT bans land conversion.18 ఎకరాల్లో మడ అడవులకు నష్టం కలిగించినందుకు గాను
By తోట వంశీ కుమార్ Published on 16 Nov 2022 11:00 AM ISTకాకినాడ: తూర్పుగోదావరి జిల్లాలో 18 ఎకరాల్లో మడ అడవులకు నష్టం కలిగించినందుకు గాను రూ.5 కోట్ల మధ్యంతర పరిహారం చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశించింది. మడ అడవులు, పర్యావరణ వ్యవస్థను రక్షించాలని కోరుతూ పర్యావరణవేత్త బొల్లిశెట్టి సత్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్‌పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (సదరన్ జోన్) చెన్నై ఈ తీర్పును వెలువరించింది.
2020లో అప్పటి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పేదల కోసం గృహనిర్మాణ పథకం (పేదలందరికి ఇల్లు - నవరత్నాలు) కోసం మడ అడవులు, మట్టితో నిండిన 120 ఎకరాల భూమిని సేకరించారు.
కాకినాడ శివారులోని దమ్మాలపేటలోని పలు సర్వే నంబర్లలో ఉన్న మడ అడవులను ఏపీ ప్రభుత్వం ధ్వంసం చేసిందని, సీఆర్‌జడ్ నిబంధనలు, పర్యావరణ పరిరక్షణ, వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని ఉల్లంఘించిందంటూ విశాఖపట్టణానికి చెందిన బొలిశెట్టి సత్యనారాయణ పిటిషన్‌ను దాఖలు చేశారు. విచారించిన ట్రైబ్యునల్ పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో అడవులను ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. సీఆర్ జడ్-1ఎ పరిధిలోకి వచ్చే ఈ ప్రాంతంలో ఇళ్ల స్థలాల ప్రాజెక్టు చేపట్టొద్దని ఆదేశించింది. ఇక్కడ మడ అడవుల ఉనికి, సంరక్షణపై ప్రభావం పడేలా భూ వినియోగ మార్పిడి కోసం అధికార యంత్రాంగం ప్రయత్నించవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఇప్పటికే అక్కడ జరిగిన విధ్వంసానికి మధ్యంతర పరిహారం కింద ఆరు నెలల్లోగా ఏపీ ప్రభుత్వం కోస్టల్ మేనేజ్‌మెంట్ అథారిటీ రూ.5 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. ఆ మొత్తాన్ని మడ అడవుల పెంపకం, సంరక్షణ కోసం వెచ్చించాలని తెలిపింది.
ఆ ప్రాంతంలో మడ అడవులకు ఎంత మేర నష్టం వాటిల్లింది. వాటిని పునరుద్ధరించేందుకు ఎంత మొత్తం అవసరమనే దానిపై అధ్యయనం కోసం ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీని నియమించింది.
58 ఎకరాల్లో పునరుద్ధరణ ప్రణాళిక
మొత్తం 58 ఎకరాల అటవీ ప్రాంతాన్ని మడ అడవులుగా మార్చేందుకు కమిటీ ప్రణాళిక సిద్ధం చేయనుంది. మడ అడవులను దాని విస్తీర్ణంలో 85 శాతానికి తగ్గకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది.