తీవ్ర తుపానుగా మారిన 'మాండూస్'.. అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశం
Cyclone Mandous.. AP CM YS Jagan Directs Collectors To Be Alert. బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్ తుపాను మరింత బలపడి తీవ్ర తుపానుగా మారింది.
By అంజి Published on 8 Dec 2022 4:33 PM IST
బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్ తుపాను మరింత బలపడి తీవ్ర తుపానుగా మారింది. ఇది ప్రస్తుతం తమిళనాడులోని కారైక్కాల్‌కు తూర్పు ఆగ్నేయంగా 420, చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 520 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ క్రమంలోనే దక్షిణ కోస్తా ఏపీతో పాటు రాయలసీమలోని కొన్ని ప్రాంతాలపై ప్రభావం చూపనున్న మాండూస్ తుపానును ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధతపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారిక సమావేశం నిర్వహించారు.
తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో గురువారం జరిగిన సమీక్షా సమావేశంలో.. జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మాండూస్ తుపాన్‌కు ముందు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించి రైతులకు అండగా ఉండాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆయన ఆదేశించారు. తుపాను ప్రభావంపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని అధికారులను ఆదేశించారు. తుపాను సమయంలో మత్స్యకారులు మూడు రోజుల పాటు సముద్రంలో వేటకు వెళ్లరాదని అధికారులకు తెలియజేయాలని సీఎం ఆదేశించారు.
తుపాను ప్రభావంతో నెల్లూరు, తిరుపతి, చిత్తూరు తదితర జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు సీఎంకు వివరించారు. తుపానుపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే పునరావాస కేంద్రం తరలింపుపై నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు. వివిధ శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రాణనష్టాన్ని అరికట్టాలని, సామాన్య ప్రజలకు భద్రత కల్పించాలని ముఖ్యమంత్రి సూచించారు.
రేపు రాత్రి తుపాను.. పుదుచ్చేరి, శ్రీహరికోట మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది.