ఫెంగల్‌ ఎఫెక్ట్‌తో ఎడతెరిపిలేని వర్షం.. దక్షిణ ఏపీలో జనజీవనం అస్తవ్యస్తం

తీరం దాటిన ఫెంగల్ తుఫాను దక్షిణ ఏపీపై తీవ్ర ప్రభావం చూపింది. తుఫాను కారణంగా నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కుండపోత వర్షం కురుస్తుండటంతో గణనీయమైన అంతరాయం కలిగించింది.

By అంజి  Published on  2 Dec 2024 2:44 AM GMT
Cyclone Fengal, Rains, Disrupts Life, South AP

ఫెంగల్‌ ఎఫెక్ట్‌తో ఎడతెరిపిలేని వర్షం.. దక్షిణ ఏపీలో జనజీవనం అస్తవ్యస్తం

తీరం దాటిన ఫెంగల్ తుఫాను దక్షిణ ఏపీపై తీవ్ర ప్రభావం చూపింది. తుఫాను కారణంగా నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కుండపోత వర్షం కురుస్తుండటంతో గణనీయమైన అంతరాయం కలిగించింది. భారీ వర్షాల వల్ల వ్యవసాయ కార్యకలాపాలు కుంటుపడ్డాయి. రవాణా వ్యవస్థలు దెబ్బతిన్నాయి. పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో రోజువారీ జీవనానికి అంతరాయం కలిగింది. ముఖ్యంగా తుపాను రైతులను తీవ్రంగా దెబ్బతీసింది. వరి పంట ఇంకా పొలాల్లోనే ఉండటంతో.. పంట నష్టపోయే అవకాశం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. నెల్లూరు జిల్లాలోని మెట్ట మండలాల్లోని పొగాకు రైతులు తమ పంట సున్నితమయిన "రెలుపు" దశలో ఉన్న సమయంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కందుకూరులో పంట పూలు, కాయ దశల్లో ఉండడంతో పచ్చిరొట్ట రైతులు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.

గత 24 గంటల్లో నెల్లూరు జిల్లాలో సగటున 43.5 మి.మీ వర్షపాతం నమోదైంది. మనుబోలు మండలంలో అత్యధికంగా 15 సెంటీమీటర్లు, ఇందుకూరుపేటలో 11 సెంటీమీటర్లు, రాపూరులో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కొడవలూరు, పొదలకూరు, నెల్లూరు రూరల్ వంటి ఇతర మండలాల్లో 8 సెంటీమీటర్లు, ముత్తుకూరు, బుచ్చిరెడ్డిపాళెం, సైదాపురం, అల్లూరులో 7 సెం.మీల వర్షపాతం నమోదైంది.

తిరుపతి జిల్లాలో సగటు వర్షపాతం 11 సెం.మీ. నారాయణవనం 18 సెంటీమీటర్లతో అగ్రస్థానంలో నిలవగా, 17 సెంటీమీటర్లతో పుత్తూరు రెండో స్థానంలో నిలిచింది. కేవీబీ పురం, వడమలపేట వంటి మండలాల్లో 15 సెంటీమీటర్లు, తడ, పిచ్చాటూరులో 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా తిరుపతి జిల్లాలోని పలు రిజర్వాయర్లలోకి భారీగా ఇన్ ఫ్లోలు రావడంతో అధికారులు అదనపు నీటిని విడుదల చేశారు. ఫెంగల్ తుఫాను ప్రధాన పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. భారీ వర్షం, ఈదురు గాలుల కారణంగా తిరుపతి, నెల్లూరు, సూళ్లూరుపేట, నాయుడుపేట, కావలిలో నీరు నిలిచిపోవడంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. దాదాపు ఖాళీగా ఉన్న రిజర్వాయర్లు ప్రస్తుతం 40 శాతం నిండాయి.

రవాణా సేవలకు అంతరాయం ఏర్పడింది. వంతెనలు, కాజ్‌వేలపై నీరు ప్రవహించడంతో వారాంతంలో APSRTC 45 బస్సు సర్వీసులను రద్దు చేసింది. విశాఖపట్నం-తిరుపతి మధ్య విమానాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ప్రతికూల వాతావరణం కారణంగా ముంబైకి కొత్త విమాన సర్వీసు ప్రారంభం మూడు గంటలు ఆలస్యమైంది. ఇది చివరికి 186 మంది ప్రయాణికులతో పూర్తి ఆక్యుపెన్సీతో బయలుదేరింది. తుపాను ప్రభావాన్ని తగ్గించేందుకు జిల్లా అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. ప్రత్యేక బృందాలు కట్టలపై పర్యవేక్షణ, రిజర్వాయర్లలో నీటి మట్టాల నిర్వహణ, అత్యవసర మరమ్మతులకు సిద్ధమవుతున్నాయి. నిరంతర వర్షపాతం తమ జీవనాధారానికి ముప్పు వాటిల్లుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

Next Story