కరోనా కట్టడిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతున్న కర్ఫ్యూ సడలింపుల్లో మార్పులు చేస్తూ సోమవారం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గోదావరి జిల్లాల్లో(తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి) మినహా మిగిలిన జిల్లాలో ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షలను సడలించింది. ఇక గోదావరి జిల్లాలో కరోనా పాజిటివిటీ రేటు ఇంకా తగ్గని కారణంగా.. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మాత్రమే సడలింపులు ఉంటాయని తెలిపింది.
సాయంత్రం ఆరు గంటలకే దుకాణాలను మూసివేయాలని ఆదేశించింది. గోదావరి జిల్లాలు మినహా మిగిలిన జిల్లాలో రాత్రి 9 గంటలకు దుకాణాలు మూసేయాలని తెలిపింది. గోదావరి జిల్లాల్లో పాజిటివిటీ రేటు 5 శాతం లోపు వచ్చే వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఈ సడలింపులు జూలై 7 నుంచి అమలులోకి రానున్నాయి. కాగా.. కరోనా నిబంధనలను పాటిస్తూ 50శాతం పరిమితితో రెస్టారెంట్లు, జిమ్‌లు, కళ్యాణమండపాలు తెరుచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రజలందరూ తప్పనిసరిగా మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించాలని సూచించింది