ఆటోలూ, సిటీ బస్సులు కూడా 12 వరకే.. రోడ్డు మీదకు వస్తే ఇక అంతే..!

Curfew In Andhra Pradesh.ఏపీలో కరోనా కేసులు పెరుగుతూ ఉండడంతో కట్టడి చేయడానికి మే 5వ తేదీ నుండి పాక్షిక కర్ఫ్యూ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

By Medi Samrat  Published on  4 May 2021 5:57 PM IST
curfew in AP

ఏపీలో కరోనా కేసులు పెరుగుతూ ఉండడంతో కట్టడి చేయడానికి మే 5వ తేదీ నుండి పాక్షిక కర్ఫ్యూ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే షాపులు తెరిచేందుకు అనుమతిస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఇక ప్రజా రవాణాపైనా ఆంక్షలు విధించనున్నారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే ప్రజా రవాణాను కూడా అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత రోడ్లపైకి వచ్చే ఆటోలను సీజ్‌ చేయాలని ఆదేశాలు ఇచ్చారు.

సిటీ బస్సుల రాకపోకలను కూడా నియంత్రించేందుకు వీలుగా అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. నిర్ణీత సమయాలను మించి రాకపోకల్ని నియంత్రించాలని భావిస్తోంది. మద్యాహ్నం 12 గంటల తర్వాత అత్యవసర సేవల వాహనాలను మాత్రమే రోడ్లపైకి అనుమతించనున్నారు. ఉదయం షాపులు తెరిచే సమయంలోనే ప్రజా రవాణాకు కూడా అనుమతించాలని నిర్ణయించింది. ఆ సమయంలోనూ 144 సెక్షన్‌ అమలు చేయబోతోంది. గుంపులు గుంపులుగా షాపింగ్‌లు చేయడం, ప్రయాణాలు చేయడాన్ని నిషేధించారు. రేపటి నుంచి మొదలయ్యే ఈ ఆంక్షలు రెండు వారాల పాటు కొనసాగుతాయని ప్రభుత్వం తెలిపింది.


ఆంధ్రప్రదేశ్‌లో అన్ని జూ పార్క్‌లు మూసివేస్తున్నట్లు అటవీశాఖ ప్రకటించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. జూ లతో పాటు ఎకో టూరిజం సెంటర్లు, టెంపుల్ ఎకో పార్క్‌లు మూసివేయాలని నిర్ణయించింది.


Next Story