నేరాలు తగ్గి, సైబర్ క్రైమ్స్ పెరిగాయి..త్వరలోనే జిల్లాకో సైబర్ పోలీస్ స్టేషన్: ఏపీ డీజీపీ
By Knakam Karthik
నేరాలు తగ్గి, సైబర్ క్రైమ్స్ పెరిగాయి..త్వరలోనే జిల్లాకొక సైబర్ పోలీస్ స్టేషన్: ఏపీ డీజీపీ
ఆంధ్రప్రదేశ్‌లో ఇతర నేరాలు పూర్తిగా తగ్గి సైబర్ నేరాల రేటు పెరిగిందని ఆ రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమల రావు అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడారు. దేశ వ్యాప్తంగా సైబర్ నేరాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయని అన్నారు. సైబర్ క్రైమ్ రేటును తగ్గించేందుకు త్వరలోనే జిల్లాకు ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. సైబర్ నిపుణుల సహాయంతో ప్రజలకు అవగాహన కల్పించడమే ఆ సైబర్ పోలీస్ స్టేషన్ల ప్రధాన లక్ష్యమని డీజీపీ చెప్పారు. ఎవరైనా అపరిచిత వ్యక్తులు ఫోన్ చేస్తే డబ్బులు చెల్లించవద్దని సూచించారు. సైబర్ నేరాలపై అవగాహన పెంచుకుంటేనే వాటిని నిరోధించగలమని ఆయన తెలిపారు. చిన్న పిల్లలు, వృద్ధులు, మహిళలపై లైంగిక దాడులు పెరుగుతున్నాయని డీజీపీ ద్వారకా తిరుమల రావు అన్నారు.
ఏపీలో గంజాయి నిర్మూలనకు ఐదుగురు కేబినెట్ మినిస్టర్స్‌తో కూడిన కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. గంజాయి అక్రమ రవాణాకు ఈగల్ సంస్థ సమర్థవంతంగా అడ్డుకట్ట వేస్తోందని చెప్పారు. ఎక్కడ గంజాయి పట్టుబడినా దాని మూలాలు ఉత్తరాంధ్ర కేంద్రంగానే ఉంటున్నాయని తెలిపారు. అనకాపల్లి జిల్లా పరవాడలో బుధవారం 37 వేల కిలోల గంజాయిని దగ్ధం చేసినట్లు ఆయన గుర్తు చేశరు. పోలీసుల ఆధ్వర్యంలో ఇటీవల సంకల్పం పేరిట డ్రగ్స్ నిర్మూలన కార్యక్రమాలను కూడా కాలేజీలు, పాఠశాలల్లో నిర్వహిస్తూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నట్లు డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు.
నేరాల నియంత్రణలో సాంకేతికతను మరింత వినియోగించుకునేలా మార్చి ఒకటవ తేదీ నాటికి లక్ష సీసీ కెమెరాలు ఏర్పాట్లు లక్ష్యంగా ఫోకస్ పెట్టామని డీజీపీ తెలిపారు. సీసీ కెమెరాలను డోనర్స్, ప్రజల సహకారంతో ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎక్కడ, ఎలాంటి నేరం జరిగిన ఏదో ఒక కెమెరాలో రికార్డు కావాలనేదే తమ ప్రయత్నమని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల స్పాట్లను ఐడెంటిఫై చేయడం జరిగిందని, రెండు లక్షల సీసీ కెమెరాలను ఆ ప్రదేశాల్లో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. పోలీసులు ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించాలని ఆయన పేర్కొన్నారు.