ఏపీకి 3.60ల‌క్ష‌ల వ్యాక్సిన్లు

Covishield Vaccine Reached Andhrapradesh.ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి మ‌రిన్ని కోవిషీల్డ్ టీకాలు వ‌చ్చాయి. మ‌హారాష్ట్ర పుణెలోని సీరం ఇన్‌స్టిట్యూట్ నుంచి 3.6 ల‌క్ష‌ల వ్యాక్సిన్లు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 May 2021 7:20 AM GMT
Covishield Vaccine

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి మ‌రిన్ని కోవిషీల్డ్ టీకాలు వ‌చ్చాయి. మ‌హారాష్ట్ర పుణెలోని సీరం ఇన్‌స్టిట్యూట్ నుంచి 3.6 ల‌క్ష‌ల వ్యాక్సిన్లు గ‌న్న‌వ‌రం విమానాశ్ర‌యానికి చేరుకున్నాయి. వాటిని టీకా కేంద్రానికి త‌ర‌లించారు. అక్క‌డి నుంచి జిల్లాల‌కు పంప‌నున్నారు. ఇక రాష్ట్రంలో టీకాల కొర‌త అధికంగా ఉన్న నేప‌థ్యంలో కేవ‌లం 45 ఏళ్లు దాటిన మాత్ర‌మే టీకా ఇస్తున్నారు. అందులోనూ రెండో డోసు వేయించుకునే వారికి ప్రాధాన్య‌త ఇస్తామ‌ని వైద్యారోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు.

రాష్ట్రంలో కోవిడ్ మ‌హ‌మ్మారి విజృంభిస్తోంది. గ‌డిచిన 24గంట‌ల్లో 20,065 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో న‌మోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 12,65,439కి చేరింది. రాష్ట్రంలో అత్య‌ధికంగా విశాఖ‌ప‌ట్నంలో 2,525 మంది, విజ‌య‌న‌గ‌రంలో అత్య‌ల్పంగా 650 మంది క‌రోనా బారిన ప‌డ్డారు. కోవిడ్ వల్ల పశ్చిమ గోదావరిలో పద్నాలుగు మంది, విశాఖపట్నంలో పన్నెండు మంది, అనంతపూర్ లో పది మంది, గుంటూరు లో పది మంది, తూర్పు గోదావరి లో తొమ్మిది, విజయనగరం లో తొమ్మిది, కర్నూల్ లో ఏడుగురు, నెల్లూరు లో ఏడుగురు, చిత్తూర్ లో ఆరుగురు, కడప లో ఐదుగురు, కృష్ణ లో నలుగురు, శ్రీకాకుళం లో ముగ్గురు చొప్పున మొత్తం 96 మంది క‌రోనా కార‌ణంగా మరణించారు. దీంతో మ‌హ‌మ్మారి రాష్ట్రంలో మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు మృతి చెందిన వారి సంఖ్య 8,615కి చేరింది. నిన్న 19,272 మంది కోలుకోగా.. మొత్తంగా క‌రోనా బారి నుంచి బ‌య‌ట‌ప‌డిన వారి సంఖ్య 10,69,432కి చేరింది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 1,87,392 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ఆక్సిజన్‌ మానిటరింగ్‌ కమిటీ

రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరుగుతుండ‌డంతో ఇప్ప‌టికే మ‌ధ్యాహ్నాం 12 నుంచి పాక్షిక లాక్‌డౌన్ విధించిన సంగ‌తి తెలిసిందే. కరోనా బాధితులకు ఆక్సిజన్‌ సరఫరా చాలా కీలకమైనందున.. దీన్ని సమర్థంగా నిర్వహించడం కోసం 9 మంది సభ్యులతో మానిటరింగ్‌ కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులిచ్చింది. ప్రస్తుతం ఆక్సిజన్‌ ఎంత కావాలి? భవిష్యత్‌ అవసరాలకు ఎంత అవసరం.. అనే అంశాలను పరిశీలించడంతో పాటు.. ఎలాంటి అంతరాయం లేకుండా ఆక్సిజన్‌ సరఫరా అయ్యేలా ఈ కమిటీ చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ పేర్కొన్నారు. ఐఏఎస్‌ అధికారులు ఢిల్లీ రావు, రాజాబాబుతో పాటు పరిశ్రమలశాఖకు చెందిన డీడీ ఎం.సుధాకర్‌బాబు, ముగ్గురు కన్సల్టెంట్లు, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ అవినాష్‌రెడ్డి, రవాణా శాఖ నుంచి ఆర్టీఏ పుమేంద్ర, ఎంవీఐ ప్రవీణ్‌లతో ఈ మానిటరింగ్‌ కమిటీని ఏర్పాటు చేశారు. ప్రత్యేక అధికారి షాన్‌ మోహన్‌కు వీరంతా రిపోర్ట్‌ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.




Next Story